RCB player Glenn Maxwell :  చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(srh) జట్టు సునామీల విరుచుకుపడి బెంగళూరు(RCB) జట్టును ముంచేసింది.  చిన్నస్వామి స్టేడియం బౌండరీలతో దద్దరిల్లింది. సిక్సులతో తడిసి ముద్దయింది. హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో  మార్మోగిపోయింది. సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనేలా.. బౌండరీలే  సింగల్‌ రన్స్‌గా మారిన వేళ హైదరాబాద్ సృష్టించిన సునామీలో... బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికే అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఇప్పుడు ఆ రికార్డును కాల గర్భంలో కలిపేసింది. మరోసారి ఉప్పెనలా మారి బెంగళూరుపై విరుచుకపడింది.

హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో తొలుత సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి  287 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితం కావడంతో హైదరాబాద్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ, డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్‌ రాణించినా.. ఆ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఈ మ్యాచ్‌ ఓటమితో బెంగళూరు ఆటగాళ్లు నిర్వేదంలో మునిగిపోయారు.

మ్యాక్స్‌వెల్‌ గుడ్‌బై 
ఈ సీజన్‌లో బెంగళూరు విధ్వంసకర బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌  పరుగులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు దూరంగా ఉన్న మ్యాక్సీ.. కీలక నిర్ణయం తీసుకున్నాడు. మానసిక సమస్యల కారణంగా ఈ లీగ్‌ టోర్నీ నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌, కోచ్‌ వద్దకు వెళ్లి.. తన బదులు మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పానని మ్యాక్సీ తెలిపాడు. ఫామ్‌ లేక ఇబ్బందులు పడుతున్నా అని.. పవర్‌ప్లేలో తమ జట్టు వైఫల్యాలను ఎదుర్కొంటోందని.. తాను ఆశించిన మేర రాణించలేకపోతున్నాని మ్యాక్స్‌వెల్‌ అంగీకరించాడు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా అన్నాడు. ఒకవేళ టోర్నమెంట్‌లో తన అవసరం ఉంటే.. తప్పకుండా బలంగా తిరిగొస్తానని మ్యాక్సీ చెప్పాడు.


మరీ ఇంత చెత్తగానా..?
ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్‌ కేవలం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లోనే మ్యాక్సీ మూడుసార్లు డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ మ్యాక్సీపై భగ్గుమంటున్నారు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్సీ.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో శ్రేయాస్‌ గోపాల్‌ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన మాక్స్‌వెల్‌.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగులు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రూ. 11 కోట్లు తీసుకుని ఇంత చెత్తగా ఆడతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతడి స్థానంలో విల్‌ జాక్స్‌ను తీసుకొన్నారు. అయినప్పటికీ బెంగళూరు ప్రదర్శనలో పెద్దగా మార్పులేదు. హైదరాబాద్‌పై 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.