ఢిల్లీ ఆయుధం అతనే
ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చెప్పాలంటే పెద్ద జట్టుగానే కనిపిస్తుంది. కానీ, టోర్నీలో మ్యాచ్‌లు జరిగే కొద్దీ పలచబడిపోతారు అన్న పేరుంది. ప్రస్తుత ఢిల్లీ టీమ్‌లో రిషబ్‌పంత్ చేరిక కొంత బలాన్నిచ్చేదే. రోడ్డు ప్రమాదం వల్ల గత సీజన్ లో ఆడలేకపోయిన పంత్ ప్రస్తుతం అందుబాటులోకివచ్చాడు. ఇక డేవిడ్ వార్నర్ ఉండనే ఉన్నాడు. మిచెల్ మార్ష్, రికీ బుయ్, స్టబ్స్, పృథ్వీషా లాంటి బ్యాటర్లు ఉండగా, నోర్జే, ముఖేష్‌కుమార్, ఇషాంత్ శర్మ బౌలింగ్ భారాన్ని మోయాలి. కానీ 15 నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్, ఫామ్‌లో లేని పృథ్వీషా ఢిల్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఇక జట్టుకి కొండంత అండ అంటే అక్షర్‌పటేల్, కుల్‌దీప్ యాదవ్ అని చెప్పొచ్చు. అలాగే సడన్‌గా సీజన్ నుంచి డ్రాప్ అయిన హ్యారీ బ్రూక్‌లతో కొంత బలహీనపడటం వాస్తవం.
పంజాబ్ బలంగానే...
ఇక పంజాబ్ విషయానికొస్తే పేలవ ప్రదర్శనతో సతమతమయ్యే పంజాబ్ ఈ సారి పేపర్ మీద బలంగానే కనిపిస్తోంది. శిఖర్‌ధావన్ కెప్టెన్సీలో బరిలోకిదిగుతున్న పంజాబ్... బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, రోసోవ్, ప్రభుసిమ్రన్‌సింగ్, జితేశ్‌శర్మ లతో పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లో చాలినన్ని వనరులున్నాయి. కగిసో రబడ, హర్షల్‌పటేల్, అర్షదీప్ సింగ్, క్రిస్‌వోక్స్, అల్‌రౌండర్ సామ్‌కరణ్, రాహుల్ చాహర్ లతో సమర్ధవంతంగా కనిపిస్తోంది. కాబట్టి పంజాబ్‌తో పోటీ అంత సులువుకాదనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది ఈ జట్టు.
ఇక ఈ రెండు టీమ్‌ల మధ్య గణాంకాలు పరిశీలిస్తే....ఇప్పటివరకు వీళ్లిద్దరి మధ్య 32మ్యాచ్ లు జరిగితే, ఢిల్లీ16 మ్యాచ్‌లు, పంజాబ్ 16 మ్యాచ్‌లు గెలిచింది. 2021 నుంచి వరుసగా పంజాబ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచింది. కానీ గత సీజన్‌లో పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచింది.