CSK vs RCB Match Highlights: ఐపీఎల్ 2024ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ప్రారంభించింది. చెపాక్ మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రచిన్ రవీంద్ర (37: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాలుగు వికెట్లు తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


చెలరేగిన రచిన్ రవీంద్ర
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి శుభారంభమే లభించింది. మొదటి వికెట్‌కు కెప్టెన్ రుతురాజ్ (15: 15 బంతుల్లో, మూడు ఫోర్లు), రచిన్ రవీంద్ర (37: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) నాలుగు ఓవర్లలోనే 38 పరుగులు జోడించారు. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్‌ను యష్ దయాళ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానే (27: 19 బంతుల్లో, రెండు సిక్సర్లు) కూడా సిక్సర్లతో విరుచుకుపడటంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.


పవర్ ప్లే తర్వాతి ఓవర్లోనే కరణ్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రచిన్ రవీంద్ర అవుటయ్యాడు. కొద్దిసేపటికే కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అజింక్య రహానే పెవిలియన్ బాట పట్టాడు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన డేరిల్ మిషెల్‌ను (22: 18 బంతుల్లో, రెండు సిక్సర్లు) కూడా గ్రీన్ అవుట్ చేయడంతో శివం దూబే (34 నాటౌట్: 28 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (25: 17 బంతుల్లో, ఒక సిక్సర్) ఆచితూచి ఆడారు. కానీ రన్‌రేట్‌ పీకల మీదకు రాకుండా చూసుకున్నారు. దీంతో కుదురుకున్నాక షాట్లు కొట్టి సులభంగా మ్యాచ్ గెలిపించారు. బెంగళూరు బౌలర్లలో కామెరాన్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టగా, యష్ దయాళ్, కరణ్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.


పడుతూ, లేస్తూ సాగిన ఆర్సీబీ బ్యాటింగ్
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మంచి ఆరంభం లభించింది. కెప్టెన్, ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (35: 23 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) బౌండరీలతో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో బెంగళూరు మూడు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 33 పరుగులు సాధించింది. బెంగళూరు భారీ స్కోరు ఖాయం అనుకున్నారంతా. కానీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నుంచి ఆర్సీబీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. చెన్నై స్టార్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన మొదటి ఓవర్లోనే ఫాంలో ఉన్న ఫాఫ్ డుఫ్లెసిస్, వన్ డౌన్ బ్యాటర్ రజత్ పాటీదార్‌లను (0: 3 బంతుల్లో) అవుట్ చేశాడు. పేస్ బౌలర్ దీపక్ చాహర్ తర్వాతి ఓవర్లోనే ఫాంలో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను (0: 1 బంతి) మొదటి బంతికే బోల్తా కొట్టించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది.


ఈ దశలో విరాట్ కోహ్లీ (21: 20 బంతుల్లో, ఒక సిక్సర్), కామెరాన్ గ్రీన్ (18: 22 బంతుల్లో, ఒక ఫోర్) బెంగళూరు ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అనంతరం ముస్తాఫిజుర్ మరోసారి బెంగళూరును దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్‌లను పెవిలియన్ బాట పట్టించాడు. ఈ దెబ్బకు బెంగళూరు 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ అనుజ్ రావత్ (48: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), దినేష్ కార్తీక్ (38 నాటౌట్: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) బెంగళూరును ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు 50 బంతుల్లోనే 95 పరుగులు జోడించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు, దీపక్ చాహర్‌ ఒక వికెట్ తీసుకున్నారు.