Drugs Siezed in Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగర శివారులో డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐడీఏ బొల్లారంలోని (Bollaram) ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఇంటర్ పోల్ అధికారులు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు జరిపారు. పీఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించి 90 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్ల నుంచి వీటిని తయారు చేసి విదేశాలకు తరలిస్తోన్న కస్తూరిరెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ కొంతవరకూ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. సిగరెట్ ప్యాకెట్లలో వీటిని పెట్టి బయటకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
జగిత్యాలలో..
అటు, జగిత్యాల జిల్లాలో టెన్త్ విద్యార్థినులు మత్తుకు బానిస కావడం కలకలం రేపింది. గంజాయికి బానిసైన విద్యార్థినులు రోజూ సేవిస్తూ మత్తులో జోగుతున్నారు. బాలికలు వింతగా ప్రవర్తించడంతో అనుమానం వచ్చిన ఓ బాలిక తండ్రి ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికలను శిశు సంరక్షణ కమిటీకి తరలించగా.. అక్కడ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బాలికలకు గంజాయి సప్లై వెనుక సెక్స్ రాకెట్ ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతి పార్టీకి ఈ ముఠా రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దాదాపు 10 మంది బాలికలు గంజాయికి బానిసైనట్లు సమాచారం. ఈ ఘటనపై నార్కోటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. బాలికలను మత్తుకు బానిస చేస్తున్న వారి వెనుక అసలు సూత్రదారులెవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. సెక్స్ రాకెట్ ముఠాపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.