Former CM KCR condemned Kejriwal arrest : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్   అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజుని కేసీఆర్ స్పష్టం చేశారు.  ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయన్నారు.  ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటున్న‌దని మండిపడ్డారు.  ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తున్న‌దని కేసీఆర్ ప్రకటించారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ . అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నామన్నారు.  


ఇండియా కూటమి నేతలంతా ఇప్పటికే  కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు.  తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ  బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఈ అరెస్టును ఖండించారు. ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రులను ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా చేసుకొని అరెస్ట్ చేస్తున్నారని, ఇది చాలా దారుణమని విమర్శించారు. అదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సీబీఐ లేదా ఈడీ దర్యాఫ్తు చేస్తున్న నాయకులు ఎవరైనా బీజేపీలో ఉంటే మాత్రం వారికి శిక్షపడదని ఆరోపించారు. ముఖ్యంగా ఇతర పార్టీలో ఉన్నప్పుడు దర్యాఫ్తు సంస్థలు వెంటబడతాయని… బీజేపీలో చేరిన తర్వాత ఎలాంటి శిక్ష ఉండదన్నారు. ఇలాంటి వైఖరిని ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా మమతా బెనర్జీ పేర్కొన్నారు.                    


కేసీఆర్ ఇండియా కూటమిలో లేరు. అయినప్పటికీ.. కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు. జాతీయ రాజకీయాలపై ప్రస్తుతం కేసీఆర్ ఎలాంటి ఆలోచనలు చేయడం లేదు.  లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు.  నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంక‌ట్రామిరెడ్డిని బ‌రిలో దించుతున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు. భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, సికింద్రాబాద్, హైద‌రాబాద్ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ నాలుగు స్థానాల‌కు కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వ‌ర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వ‌ర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య‌ పోటీ చేయ‌నున్నారు.