IPL Mega Auction 2022, memes on David Warner: హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన డేవిడ్ వార్నర్‌ను దిల్లీ క్యాపిటల్స్ అతి తక్కువ ధరకే తీసుకుంది. వేలంలో అతడికి కనీసం రూ.10 కోట్లకు పైగా వస్తుందని అభిమానులు అంచనా వేశారు. అందుకు భిన్నంగా అతడు రూ.6.25 కోట్లకే దిల్లీ అతడిని తీసుకుంది. దాంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువలా ట్రెండ్ అవుతున్నాయి.
వేలంలో డేవిడ్ వార్నర్ పేరు రాగానే అందరికీ ఆసక్తి కలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడి కోసం సరదాకైనా ఒకసారి బిడ్ వేస్తుందా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆక్షనీరు అతడి పేరు చెప్పగానే ఒక నిమిషం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మొదట దిల్లీ అతడికి బిడ్ వేసింది. వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. ఆపై ముంబయి ఇండియన్స్ ప్రవేశించింది. దాంతో చూస్తుండానే అతడి ధర రూ.6 కోట్లకు చేరుకుంది. ఆపై దిల్లీ రూ.6.25 కోట్లకు బిడ్ వేసింది. తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో అనుకున్న స్థాయి కన్నా తక్కువ ధరకే వార్నర్ అమ్ముడుపోయాడు.
తన స్థాయికి తగిన ధర కన్నా తక్కువకే దిల్లీ వార్నర్‌ను సొంతం చేసుకోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. 'బేరాలాడటంలో దిల్లీవాళ్లకు తిరుగులేదు! కానీ డేవిడ్ వార్నర్‌ను రూ.6.25 కోట్లకే సొంతం చేసుకోవడమంటే అది సరోజ్ నగర్ మార్కెట్ స్థాయి బేరమే' అని మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ జోక్ చేశాడు. 'డేవిడ్ వార్న్‌ను దిల్లీ రూ.6.25 కోట్లకే తీసుకుంది. ఇది వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ వ్యాపారానికి మంచిది కాదు' అని ఓ నెటిజన్ అన్నాడు. 'దిల్లీ ఇప్పటికే ఐపీఎల్ గెలిచేసింది. డేవిడ్‌ను తీసుకోవడం అత్యుత్తమ ఎంపిక' అని మరొకరు అన్నారు.