IPL 2025 SRH vs GT Mohammed Siraj | హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో నెగ్గాలన్న కసితో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కు తొలి ఓవర్లోనే హైదరాబాదీ షాకిచ్చాడు. గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (8) వికెట్ తీసి సన్‌రైజర్స్ ను, అభిమానులను సైలెన్స్ చేశాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ తొలి ఓవర్లోనే సక్సెస్ అయ్యాడు సిరాజ్. అసలే హైదరాబాదీ కావడంతో సిరాజ్ భాయ్ ఎంత పని చేశావ్ అని సన్ రైజర్స్ ఫ్యాన్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల వికెట్ల మీద స్పందిస్తున్నారు. పవర్ ప్లే 6 ఓవర్లు పూర్తయ్యేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది.
పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఔట్
అసలే మూడు వరుస మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దాంతో ఆదివారం రాత్రి గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెగ్గాలని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సిరాజ్ డబుల్ స్ట్రైక్ కు ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు విలవిల్లాడిపోయారు. 3 ఓవర్లు వేసిన మహ్మద్ సిరాజ్ కేవలం 14 పరుగులిచ్చి, 2 కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌లో నిరాశ నింపాడు. అటు సొంత గడ్డ హైదరాబాద్‌లో చెలరేగుతూ సిరాజ్ భాయ్ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు.
ఫుల్ లెంగ్త్ డెలివరీలు వేస్తూ సన్‌రైజర్స్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు సిరాజ్. ఫుల్ లెంగ్త్ బాల్ సందించగా తొలి ఓవర్లో 5వ బంతిని ట్రావిస్ హెడ్ డిఫెన్స్ ఆడాడు. సాయి సుదర్స్ ఎడమవైపు డైవ్ చేస్తూ ఈజీగా క్యాచ్ పట్టడంతో షాక్ కావడం హెడ్, సన్ రైజర్స్ ఫ్యాన్స్ వంతు అయింది. ఆపై ఇన్నింగ్స్ 5వ ఓవర్లో అభిషేక్ శర్మ మిడాన్ వైపు అభిషేక్ శర్మ (18) షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. రాహుల్ తేవాటియా క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. దాంతో డీఎస్పీ సిరాజ్ ఆన్ ఫైర్ అంటూ హైదరాబాద్ పేసర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ పేసర్ సిరాజ్ 100 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఈ మ్యాచ్ కు ముందు 98 వికెట్లతో ఉన్న మహ్మద్ సిరాజ్ ట్రావిస్ హెడ్ వికెట్ తో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. అనంతరం అభిషేక్ శర్మ వికెట్ తీయడంతో ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.