IPL 2025 SRH VS GT Live Updates: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోపోరుకు సిద్ధమైంది. ఆదివారం సొంత గడ్డ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఘనవిజయం సాధించి, ఈ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ చేయాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలగా ఉంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో వరుస ఓడి, అభిమానులను నిరాశ పర్చిన సన్.. ఈ మ్యాచ్ లో గెలుపే టార్గెట్ గా బరిలోకి దిగనుంది. మరోవైపు రెండు వరుస విజయాలతో జోరు మీదున్న టైటాన్స్.. అదే ఊపులో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. సన్ పై మంచి రికార్డు ఉన్న టైటాన్స్.. ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసింది. హర్షల్ పటేల్ స్థానంలో జైదేవ్ ఉనాద్కట్ ను జట్టులోకి తీసుకుంది.
ఒత్తిడిలో సన్ రైజర్స్..తొలి మ్యాచ్ లో 286 పరుగులతో అదరగొట్టి, 300 రన్స్ మార్కుపై ఆశలు రేపిన సన్ రైజర్స్ ఆ తర్వాత తుస్సుమంది. గత మూడు మ్యాచ్ ల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి పాలైంది. ఇక కోల్ కతా నైట్ రైడర్స్ పై అయితే అవమానకరంగా 120 పరుగులకే కుప్పకూలింది. హిట్టర్లతో నిండిన సన్.. ఇలా తడబడటం క్రికెట్ అభిమానులకు షాకిస్తోంది. బ్యాటింగ్ పవర్ ఏమైందని ఆలోచనలో పడిపోయారు. అయితే సొంతగడ్డపై గతంలో పరుగుల వరద పారించిన రికార్డు ఉండటంతో ఈ మ్యాచ్ నుంచి గాడిన పడాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. ఇక టాస్ గెలిస్తే ఇరుజట్లు బౌలింగ్ తీసుకోవాలని భావించాయి. అంటే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందేమోనని పలువరు భావిస్తున్నారు.
సన్ టీమ్ లో ఆడిన ముగ్గురు..
ఈ టోర్నీలో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన టైటాన్స్ తమ జోరు చూపిస్తోంది. తొలి మ్యాచ్ లో ఓడినా, వరుసగా రెండు విజయాలు సాధించడం ప్లస్ పాయింట్. గతంలో సన్ తరపున ఆడిన ముగ్గురు ప్లేయర్లు జీటీ జట్టులో ఉండటం సానుకూలాంశం. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ ల రూపంలో ఉప్పల్ స్టేడియం గురించి అవగాహాన ఉన్న ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ లో కూడా గెలిచి, హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుని, టాప్ ప్లేస్ ను దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ లో టైటాన్స్ కూడా ఒక మార్పు చేసింది. పేసర్ అర్షద్ ఖాన్ స్థానంలో సుందర్ ని ప్లేయింగ్ లెవన్ లోకి తీసుకుంది.