IPL set for March 22 start, says league chairman Arun Dhumal: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) మార్చి 22న ప్రారంభం కానుందని...IPL ఛైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగినా దేశంలోనే పూర్తిగా ఐపీఎల్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉందని.. అందుకే ఐపీఎల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ ఇంకా వెల్లడి కాలేదని ధుమాల్‌ వెల్లడించారు. తొలుత మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటిస్తామని, సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని వెల్లడించారు. మార్చి నెల ఆరంభంలో దేశంలో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. తాము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని... మొత్తం టోర్నమెంట్ భారతదేశంలోనే జరుగుతుందని ధుమాల్ చెప్పారు.



రంజీ ఆడితేనే ఐపీఎల్‌!
ఐపీఎల్‌(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్‌(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్‌ కిషన్‌... ఐపీఎల్ ఆడేందుకు మాత్రం రెడీ అవుతున్నాడన్న  వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్‌ ఆడని ఇషాన్‌ను తుదిజట్టులోకి ఎలా తీసుకుంటామని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రశ్నిస్తోంది. స్వయంగా రాహుల్‌ ద్రావిడ్‌ కూడా రంజీ ఆడాలంటూ ఇషాన్‌కు సూచించాడు. అయితే ద్రవిడ్‌ మాటలను సైతం పెడచెవిన పెట్టిన ఇషాన్‌.. దేశవాలీ టోర్నీలను కాదని ఐపీఎల్‌ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్‌ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. బీసీసీఐతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ఆటగాళ్లు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాలీ టోర్నీల్లో పాల్గొనాలని రూల్‌ పాస్‌ చేశారు. 



ధోనీకిది చివరిది కాదా..?
ధోనీ తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌కు కూడా సిద్ధమైపోయాడని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ధోనీకిది చివరి ఐపీఎల్‌ కాదని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్‌ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంఎస్‌ ధోనికి కొన్నిరోజుల కిందట కలిశానని. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్‌ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడని ధోనీ తెలిపాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని... ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడని పఠాన్‌ వ్యాఖ్యానించాడు.