Virat Kohlis 113 takes Royal Challengers Bengaluru to 183for 3 in Jaipur: ఈ ఐపీఎల్‌( IPL 2024)సీజన్‌లోనే తొలి శతకం నమోదైంది.  రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) తొలి శతకంతో చెలరేగిన వేళ... రాజస్థాన్‌(RR)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB) భారీ స్కోరు చేసింది. తన ఆటకు తిరుగులేదని నిరూపిస్తూ.... పరుగుల వరద పారించడంలో తనను మించిన మొనగాడు ప్రస్తుత క్రికెట్‌లో లేడని మరోసారి రుజువు చేస్తూ విరాట్‌ కోహ్లీ శతక నినాదం చేశాడు. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీకి ఇది ఎనిమిదో శతకం కావడం విశేషం. విరాట్‌ ఒంటరి పోరుతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.


మళ్లీ కోహ్లీ ఒక్కడే..
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. చివరి బంతికి డుప్లెసిస్ బౌండరీ బాదాడు. ఆరంభం నుంచే విరాట్ కోహ్లీ  దూకుడుగా ఆడాడు. నంద్రి బర్గర్ వేసిన రెండో ఓవర్‌లో 13 పరుగులు రాగా.. కోహ్లీ రెండు బౌండరీలు బాదాడు. నంద్రి బర్గర్ వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతిని డీప్‌ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్సర్‌ చూసి తీరాల్సిందే. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 88 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. సిక్స్‌తో కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.11 ఓవర్లకు స్కోరు 98/0. 12ఓవర్‌లో బెంగళూరు స్కోరు వంద పరుగులు దాటింది. 13 ఓవర్లకు స్కోరు 115/0. చాహల్ వేసిన 14 ఓవర్‌లో చివరి బంతికి 44 పరుగులు చేసిన డుప్లెసిస్‌ అవుటయ్యాడు. అనంరం మ్యాక్స్‌వెల్  ఒక్క పరుగే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నంద్రి బర్గర్ వేసిన 15 ఓవర్‌లో ఐదో బంతికి మ్యాక్సీ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 16వ ఓవర్‌లో బెంగళూరు స్కోరు 150 దాటింది. 17 ఓవర్లకు స్కోరు 154/2. చాహల్ వేసిన 17.2 ఓవర్‌కు సౌరభ్‌ చౌహన్‌ 9 పరుగులు చేసి యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో కోహ్లీ మూడంకెల స్కోరు అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  విరాట్‌ ఒంటరి పోరుతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఇవీ గత రికార్డులు
ఇప్పటివరకూ ఇరు జట్లు 30 మ్యాచుల్లో తలపడగా బెంగళూరు 15 మ్యాచుల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. ఆర్‌ఆర్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 200 కాగా, ఆర్‌సిబిపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 217.  ఈ మ్యాచ్‌ జరిగే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా రాజస్థాన్‌ రాయల్స్ నాలుగు సార్లు గెలవగా... బెంగళూరు కూడా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 2023లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.