Rajasthan Royals vs Royal Challengers Bengaluru Head to head records :  ఐపీఎల్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. వరుస పరాజయాలతో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB).. రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 30 మ్యాచుల్లో తలపడగా బెంగళూరు 15 మ్యాచుల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి.

 

2008 ఏప్రిల్‌ 26న తొలి ఐపీఎల్‌లో ఈ జట్లు తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో బెంగళూరు ఘన విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో షేన్ వాట్సన్ 2/20తో స్టార్‌గా నిలిచాడు. బ్యాట్‌తోనూ చెలరేగి నాలుగు 41 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేశాడు. 2009లో సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌... బెంగళూరుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆ మ్యాచ్‌లో అమిత్ సింగ్ 4/19 స్పెల్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నమన్ ఓజా అజేయ అర్ధ సెంచరీ చేశాడు. 2018లో జరిగిన ఐపీఎల్‌లో బెంగళూరుపై రాజస్థాన్‌ రాయల్స్‌ 217 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య ఇదే అత్యధిక స్కోరు. అప్పటి మ్యాచ్‌లో సంజు శాంసన్ కేవలం 45 బంతుల్లో 2 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 92 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 




 

ఇరు జట్ల బెస్ట్‌లు ఇవే..

ఆర్‌ఆర్‌పై బెంగళూరు అత్యధిక స్కోరు 200 కాగా, ఆర్‌సిబిపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 217.  ఈ మ్యాచ్‌ జరిగే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా రాజస్థాన్‌ రాయల్స్ నాలుగు సార్లు గెలవగా... బెంగళూరు కూడా నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 2023లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. RCBపై రాజస్థాన్‌ బ్యాటర్‌ అత్యధిక స్కోరు 106 పరుగులు. 2022 ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ 106 పరుగులు చేశాడు. రాజస్థాన్‌ బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన  4/16. శ్రేయస్‌ గోపాల్‌ పేరిట ఈ రికార్డు ఉంది. 

 

పరాజయాలకు బ్రేక్‌ పడేనా..?

బెంగళూరు ఈ ఐపీఎల్‌లో ఐదో మ్యాచ్‌ ఆడనుంది. రాజస్థాన్‌కు ఇది నాలుగో మ్యాచ్‌. మార్చి 24న జరిగిన తొలి మ్యాచ్‌లో RR... లక్నో సూపర్ జెయింట్స్‌పై 20 పరుగుల తేడాతో గెలిచింది. మార్చి 28న ఢిల్లీ క్యాపిటల్స్‌పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ పై కూడా రాజస్థాన్ విజయం సాధించింది. ఇలా ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ రాజస్థాన్‌ గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ సహా మూడు మ్యాచుల్లో బెంగళూరు పరాజయం పాలైంది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో RCB ఓడిపోయింది. మార్చి 25న వారు పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరు గెలిచింది. మార్చి 29న KKR చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన నాలుగో గేమ్‌లో కూడా ఓటమి చవిచూసింది. 

 

రాజస్థాన్ రాయల్స్ (RR): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ. 

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఫాఫ్ డు ప్లెసిస్ , విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్  మయాంక్ దాగర్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.