IPL 2024 PBKS vs DC pbks choose to field : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. మొహాలీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(DC) -పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై గెలిచి ఐపీఎల్‌ను ఘనంగా ఆరంభించగా ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి రెండో మ్యాచ్‌పై పడింది. కారు ప్రమాదంలో గాయపడి అనంతరం కోలుకుని జట్టులో చేరిన రిషబ్ పంత్ ఎలా ఆడతాడో అన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
పంతే ఆయుధం
ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగానే కనిపిస్తోంది. ఢిల్లీ టీమ్‌లో రిషబ్‌పంత్ చేరిక కొంత బలాన్నిచ్చేదే. రోడ్డు ప్రమాదం వల్ల గత సీజన్ లో ఆడలేకపోయిన పంత్ ప్రస్తుతం అందుబాటులోకివచ్చాడు. డేవిడ్ వార్నర్ ఉండనే ఉన్నాడు. మిచెల్ మార్ష్, రికీ బుయ్, స్టబ్స్, పృథ్వీషా లాంటి బ్యాటర్లు ఉండగా, నోర్జే, ముఖేష్‌కుమార్, ఇషాంత్ శర్మ బౌలింగ్ భారాన్ని మోయాలి. కానీ 15 నెలల తర్వాత క్రికెట్ ఆడుతున్న పంత్, ఫామ్‌లో లేని పృథ్వీషా లతో ఢిల్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఇక జట్టుకి కొండంత అండ అక్షర్‌పటేల్, కుల్‌దీప్ యాదవ్ అని చెప్పొచ్చు. హ్యారీ బ్రూక్ అర్ధాంతంరంగా జట్టు నుంచి వెళ్లిపోవడం ఢిల్లీకు గట్టి ఎదురుదెబ్బే.
పంజాబ్ కూడా బలంగానే...
పంజాబ్ కూడా బలంగానే కనిపిస్తోంది. గత అవమానాలను, అపజయాలను వదిలేసి ఈసారి టైటిల్ సాధించాలని పంజాబ్ పట్టుదలగా ఉంది. శిఖర్‌ధావన్ కెప్టెన్సీలో బరిలోకిదిగుతున్న పంజాబ్... బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, రోసోవ్, ప్రభుసిమ్రన్‌సింగ్, జితేశ్‌శర్మ లతో పటిష్టంగా ఉంది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్, క్రిస్‌వోక్స్, అల్‌రౌండర్ సామ్‌కరణ్, రాహుల్ చాహర్ లతో బౌలింగ్ దళం పటిష్టంగానే ఉంది.
ఇవీ రికార్డులు
ఇక ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు 32మ్యాచులు ఆడితే ఢిల్లీ16 మ్యాచ్‌లు, పంజాబ్ 16 మ్యాచ్‌లు గెలిచి సమఉజ్జీలుగా ఉన్నారు. 2021 నుంచి వరుసగా పంజాబ్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచింది. కానీ గత సీజన్‌లో పంజాబ్ ఒక మ్యాచ్ గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ పంజాబ్ వైపే ఉంది. తమ సొంత వేదికలమీద ఢిల్లీతో జరిగిన 7 మ్యాచ్‌ల్లో పంజాబ్ 6 మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగిస్తే ఢిల్లీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. హోంగ్రౌండ్ అడ్వాంటేజ్ ని అందిపుచ్చుకొని పంజాబ్ పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌లు గెలిచింది. తటస్థ వేదికల మీద జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ పంజాబ్‌కింగ్స్ ని డామినేట్ చేసింది. ఇండియాలోని ఇతర వేదికలు, ఓవర్సీస్ లో వీళ్లిద్దరిమధ్య 13 మ్యాచ్‌లు జరిగితే అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్‌లు గెలిస్తే పంజాబ్ కేవలం 4 చోట్ల విజయం సాధించింది. ఇక హోం గ్రౌండ్‌ల్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో 6 గెలిచాయి.