Delhi Capitals Lose Lungi Ngidi Ahead Of IPL 2024: మరో ఆరు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(IPL) ప్రారంభం కానుంది. ఈసారి అన్ని జట్లు ఎలాగైనా కప్పు గెలుచుకోవాలని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి. కానీ చాలా జట్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది కీలక ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమవ్వగా... ఇప్పుడు మరో స్టార్‌ ఆటగాడు కూడా దూరమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ లుంగీ ఎంగిడీ(Lungi Ngidi)ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఎంగిడీ ప్రకటించాడు. ఎంగిడీ స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్‌ జేక్‌ప్రేజర్‌ మెక్‌ గుర్క్‌(McGurk) ను ఢిల్లీ జట్టులోకి తీసుకుంది. మెల్‌బోర్న్‌కు చెందిన మెక్‌గుర్క్‌ హార్డ్‌హిట్టింగ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌తో పాటు లెగ్‌స్పిన్నర్‌. 




కెప్టెన్‌ అందుబాటులో ఉండడా..
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌ప్రారంభమవుతున్న వేళ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడిన శ్రేయస్‌ అయ్యర్‌... రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌ తర్వాత అయ్యర్‌కు మళ్లీ వెన్ను నొప్పి తిరగబెట్టిందని.. రంజీ ఫైనల్‌ ముగిసిన తర్వాత కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకుంటాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. శ్రేయస్‌ అయ్యర్‌కు వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టిందని.. అందుకే రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఐదో రోజు మైదానంలోకి దిగలేదని తెలుస్తోంది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని క్రికెట్ ఆడేందుకు అయ్యర్‌ సిద్ధమవుతాడని... దీంతో ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలో మరోసారి అయ్యర్‌కు వెన్ను నొప్పిరాగా... విశ్రాంతి తీసుకుని తిరిగి రంజీ ఫైనల్‌లో ఆడాడు. ఇప్పుడు మళ్లీ అయ్యర్‌కు వెన్ను నొప్పి గాయం తిరగబెట్టగా... నితీశ్‌ రాణాకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో... మార్చి 29న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌తో కేకేఆర్‌ ఆడనుంది.



సూర్యా కూడా డౌటే!
ఐపీఎల్‌(IPL) ప్రారంభానికి ముంబై ఇండియన్స్‌(MI)కు గట్టి షాక్‌ తగిలినట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్యా గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోలేదని... అతను ఐపీఎల్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని వార్తలు వస్తున్నాయి. 24 న గుజరాత్ టైటాన్స్ తో తొలి మ్యాచ్, 27 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో రెండో మ్యాచ్ కు సూర్య బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ రెండు మ్యాచ్ ల తర్వాత సూర్య పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే ఐపీఎల్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. కుడికాలి చీలమండకు సర్జరీ చేయించుకున్న రికవరీ అవుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్ మహ్మద్‌ షమి(Mohammed Shami ) ఐపీఎల్ సీజన్‌ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ఎడమ కాలి మోకాలుకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ( Prasidh Krishna) కూడా ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లు వెల్లడించింది.