ఐపీఎల్‌(IPL)లో హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya) ముంబై జట్టులో చేరతాడన్న ఊహాగానాలే నిజమయ్యాయి. ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ తిరిగి ముంబయి ఇండియన్స్‌( Mumbai Indians ) గూటికే చేరాడు. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans )ను ఫైనల్స్‌ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. వచ్చే సీజన్‌ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యా  ముంబయి జట్టు సొంతమయ్యాడు. ముంబైలో చేరేందుకు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ బాధ్యతల నుంచి హార్దిక్‌ పాండ్యా వైదొలిగాడు. IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్‌ జరిగి హార్దిక్‌ పాండ్యా ముంబై జట్టు సొంతమయ్యాడని తెలుస్తోంది. తొలి సీజన్‌లోనే ట్రోఫీ అందించిన కెప్టెన్‌ను విడిచిపెట్టేందుకు గుజరాత్‌ అంగీకరించడం సంచలనంగా మారింది. హార్దిక్‌ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. ఆల్ క్యాష్ ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వదిలి ముంబైతో చేరినట్లు క్రిక్ బజ్ తెలిపింది. ఒప్పందం మీద రెండు ఫ్రాంచైజీలు సంతకాలు కూడా చేసినట్లు పేర్కొంది.



 ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌ కోసం ప్లేయర్ల రిలీజ్, రిటెన్షన్‌కు ఆదివారం ఆఖరి రోజుకాగా హార్దిక్‌ పాండ్యాను అంటిపెట్టుకున్నట్లు గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత ప్రకటించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విలియమ్సన్, గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ వంటి కీలకప్లేయర్లను రిటైన్‌ చేసుకుంటున్నట్లు గుజరాత్ ప్రకటించింది. వికెట్ కీపర్ కేఎస్ భరత్, యశ్ దయాల్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ఓడియన్ స్మిత్, ప్రదీప్ సాంగ్వాన్, ధనుస్ శనక, అల్జారీ జోసెఫ్‌లను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. సాయంత్రం ఐదున్నరకు గుజరాత్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. కానీ ఆ తర్వాత రెండు గంటల్లోనే ట్విస్ట్‌ల ట్విస్ట్‌లు వచ్చాయి. అయితే రాత్రి ఏడున్నరకల్లా హార్దిక్‌ పాండ్యా ముంబైలో చేరుతున్నట్లు ప్రకటన వెలువడింది. దీంతో క్రికెట్‌ అభిమానుల దిమ్మతిరిగిపోయింది. హార్దిక్ పాండ్యాను ఆల్ క్యాష్ డీల్‌లో భాగంగా గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌కు విక్రయించినట్లు సమాచారం.  



 సాయంత్రం 5 గంటలకు హార్దిక్‌ పాండ్యా కొనుగోలు పూర్తయిందని.. ఇప్పుడతను ముంబయి ఆటగాడని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గ్రీన్‌ను బెంగళూరుకు ముంబయి ఇచ్చేసిందని ఆ తర్వాత హార్దిక్‌ను సొంతం చేసుకుందని ఆయన వెల్లడించారు.  హార్దిక్‌ పాండ్యా విషయంలో ముంబై, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మధ్య ఒప్పందం కుదిరిందని, హార్దిక్‌కు ఇచ్చే వార్షిక జీతం కాకుండా గుజరాత్‌కు భారీ మొత్తం చెల్లించేందుకు ముంబయి సిద్ధమైందని.. బీసీసీఐ, ఐపీఎల్‌ వర్గాలు చెప్పాయి. కానీ అది ఎంత మొత్తమో మాత్రం వెల్లడించలేదు. ఎంత ఇచ్చినా అందులో 50 శాతం హార్దిక్‌కు దక్కుతుంది. మరోవైపు హార్దిక్‌కు ముంబయి ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది. ముంబయి జట్టులో మరో ఆసక్తికర మార్పు చోటు చేసుకుంది.


గత వేలంలో రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను బెంగళూరుకు ముంబయి ఇచ్చేసింది. హార్దిక్‌, గ్రీన్‌ జట్టు మార్పునకు బీసీసీఐ పచ్చజెండా ఊపినా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని ప్రముఖ కామెంటర్ హర్షభోగ్లే సైతం ట్వీట్ చేశాడు. ఆల్ క్యాష్ డీల్‍‌లో భాగంగా కామెరూన్ గ్రీన్‌ను ఆర్సీబీకి విక్రయించిన ముంబై.. గుజరాత్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకున్నట్లు హర్షాభోగ్లే ట్వీట్ చేశాడు. దీంతో మూడు రోజుల నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలకు తెరపడింది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply