దేశంలో ఐపీఎల్‌(IPL) సందడి మొదలైంది. ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. రేపు(మంగళవారం) దుబాయ్ వేదికగా ఐపీఎల్ 17వ సీజన్‌ వేలం జరగనుంది. ఈ సారి వేలంలో మొత్తం 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 77 ఖాళీలే ఉండగా 333 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఈ వేలంలో భారీ ధర పలికే సత్తా ఉన్న ఆటగాళ్లు ఎవరనేది ఆసక్తిగా మారింది. వన్డే ప్రపంచకప్‌, బిగ్‌ బాష్‌ సహా పలు లీగ్‌లలో సత్తా చాటిన యువ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు కన్నేశాయి. ఈ సారి వేలంలో ఫ్రాంచైజీలు కోట్లు కురిపించే అవకాశాలున్న యువ ఆటగాళ్లు ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈసారి వేలంలో అత్యధిక ధర పలుకుతారని అంచనాలు ఉన్న అయిదుగురు యవ క్రికెటర్లు ఎవరో చూసేద్దాం. 

 

రచిన్ రవీంద్ర

భారత్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ కివీస్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర దుమ్ములేపాడు. వన్డే వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై అద్భుత సెంచరీతో ప్రపంచ క్రికెట్‌ అభిమానుల చూపును తన వైపునకు తిప్పుకున్నాడు రచిన్‌ రవీంద్ర. 10 మ్యాచ్‌లో 3 శతకాలు, రెండు అర్థ సెంచరీలతో 578 పరుగులు చేసి రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. 24 ఏళ్ల రచిన్‌.. టీ20 క్రికెట్‌లో అంతగా రాణించకపోయాడు. అయినా భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో చెలరేగడంతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్నుపడింది. రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్న రచిన్ రవీంద్ర కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. దీంతో ఈ వేలంలో రచిన్‌కు భారీ ధర పలికే అవకాశాలున్నాయి.

 

ముజీబుర్ రెహమాన్

అఫ్ఘాన్‌ స్పినర్‌ ముజీబుర్ రెహమాన్‌ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు . 22 ఏళ్ల ముజీబుర్ రెహమాన్ ఐదేళ్ల క్రితం అంటే 17 ఏళ్ల వయసులోనే 2018లో ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సీజన్‌లో పెదగా రాణించకపోవడంతో ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ముజీబ్ రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి దిగుతున్నాడు. దీంతో ఫ్రాంచైజీలు ముజీబ్‌ను మంచి ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

 

గెరాల్డ్ కోయెట్జీ

భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో  పేసర్ గెరాల్డ్ కోయెట్జీ సౌతాఫ్రికా జట్టులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న 23 ఏళ్ల ఈ కుర్రాడు 8 మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే టీ20 లీగ్‌ల్లో సత్తా చాటాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో 9 మ్యాచ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో ఈ సీజన్‌లోనే అత్యధిక వికెట్లు తీసిస టాప్ 3 బౌలర్‌గా నిలిచాడు. రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి దిగుతున్నాడు. ఇతడికి కూడా భారీ ధర దక్కే అవకాశాలున్నాయి.

 

హ్యారీ బ్రూక్

ఇంగ్లండ్‌ క్రికెటరైన 24 ఏళ్ల హ్యారీ బ్రూక్‌ను గత సీజన్‌లో రూ.13.25 కోట్ల భారీ ధర వెచ్చించి సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ అంచనాలు అందుకోలేకపోయాడు. దీంతో హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. గత ఐపీఎల్ సీజన్‌లో విఫలమైనా ఇంగ్లండ్‌లో జట్టు బ్రూక్ రాణిస్తున్నాడు. బ్రూక్‌ భారీ హిట్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2023 హండ్రెడ్ లీగ్ సీజన్‌లో హ్యారీ బ్రూక్ సత్తా చాటాడు. గత ఐపీఎల్ సీజన్‌లో విఫలమైనా ఈ సారి కూడా అతనిపై ఫ్రాంచైజీల కన్ను ఉంది.

 

రెహాన్ అహ్మద్

ఇంగ్లండ్‌కు చెందిన 19 ఏళ్ల లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఈ సారి వేలంలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు. రూ.50 లక్షల బేస్ ధరతో వేలంలోకి దిగుతున్నాడు. భారత్‌లో జరిగే ఐపీఎల్‌లో స్పిన్ పిచ్‌లు ఉండడంతో రెహాన్ అహ్మద్‌కు మంచి ధర లభించే అవకాశం ఉంది.