Virat Kohli Viral:
టన్నుల కొద్దీ పరుగులు చేయగలడు! పదుల కొద్దీ సెంచరీలు కొట్టగలడు! ఫీల్డర్ల మధ్యలోంచి అందమైన బౌండరీలు బాదగలడు! ప్రత్యర్థిని ఢీ అంటే ఢీ అంటూ బెదిరించగలడు! విజయం కోసం ఎంతకైనా తెగించగలడు! కానీ.. అసలు సిసలైన మ్యాచుల్లో జట్టును గెలిపించలేక ఇబ్బంది పడుతున్నాడు విరాట్ కోహ్లీ!
చివరి రెండు సీజన్లలో ఫామ్ కోల్పోయిన కింగ్ కోహ్లీ ఈసారి మాత్రం అదరగొట్టాడు. రెండు సెంచరీలు బాదేశాడు. స్ట్రైక్‌రేట్‌ను మరింత పెంచుకున్నాడు. ఎంతటి బౌలరైనా సరే సిక్సర్లు బాదేస్తున్నాడు. అలాంటింది గుజరాత్ టైటాన్స్‌పై ఓటమి తర్వాత అతడి కళ్లు చెమ్మగిల్లాయి.
భారీ స్కోరు చేయడం కోసం సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీలో మ్యాచ్ ఓడిపోతున్నామని తెలియగానే ఓ నిర్వేదం కనిపించింది. అతడిలోకి నిరుత్సాహం ఆవహించింది. గుండెల్లో కలుగుతున్న బాధను బయట పెట్టలేక.. దాన్ని అనుభవించలేక ఎంతగానో కుమిలిపోయాడు.
మనసులో బాధను అధిమిపట్టినా విరాట్ కోహ్లీ (Virat Kohli) బాడీ లాంగ్వేజ్‌లో అది ప్రస్ఫుటమైంది. కన్నీరు ఉబికి వచ్చింది. అందుకే ఆఖర్లో అతడు మైదానం వీడాడు. డగౌట్లో కూర్చొని కన్నీరు కార్చాడు. అతడి కంటి పొరలో నీటి చెమ్మ కనిపించగానే అభిమానులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఎంతో బాధతో.. విరాట్ కోహ్లీ కన్నీరు కారుస్తున్న చిత్రాన్ని వైరల్ చేస్తున్నారు అభిమానులు! మ్యాచులా అతడెలాంటి హావభావాలు పలికించాడో వైరల్ చేశారు. ముఖంపై టోపీ అడ్డు పెట్టుకొన్న చిత్రాలను ట్విటర్లో షేర్ చేసుకుంటున్నారు.
మ్యాచ్ ఓడిపోయినందుకు కొన్ని క్షణాలు బాధపడ్డ విరాట్ కోహ్లీ వెంటనే తేరుకున్నాడు! గుజరాత్ ఆటగాళ్లను నవ్వుతూ పలకరించాడు. అభినందనలు తెలియజేస్తూ హ్యాండ్ షేక్స్ చేశాడు. జెర్సీలపై సంతకాలు చేసిచ్చాడు. శుభ్‌మన్ గిల్‌ను కౌగిలించుకొని అభినందించాడు.
Royal Challengers Bangalore vs Gujarat Titans: ఐపీఎల్ లీగ్ దశకు అదిరిపోయే ముగింపు లభించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ ఓడించి ఇంటికి పంపించేసింది. ఈ ఓటమి ముంబై ఇండియన్స్ పాలిట వరం అయింది. వారు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.
గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (104 నాటౌట్: 52 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) అజేయమైన సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 61 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ ఇద్దరికీ ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. వీళ్లిద్దరూ గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనే సెంచరీలు సాధించారు.