Rajat Patidar Injury: ఆ జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. విదేశీ  విధ్వంసక ఆటగాళ్లకు కొదవలేదు. కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్.. అయినా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’  అన్నట్టు  ఐపీఎల్ లో ఇంతవరకు కప్ కొట్టని జట్లలో ఒకటిగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆటగాళ్లు, సారథులు మారినా  ఆ జట్టు తలరాత మారలేదు.  15 ఏండ్లుగా ఆ జట్టు అభిమానులు ట్రోఫీ కోసం  వేయి కండ్లతో ఎదురుచూస్తూ.....నే ఉన్నారు. ప్రతీ సీజన్ లోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ ‘ఈ సాలా కప్ నమ్దే’ అనుకుంటూ నిరాశచెందినట్టుగానే  రాబోయే సీజన్ లో కూడా బెంగళూరుకు నిరాశ తప్పేట్లు లేదు. కీలక ఆటగాళ్లకు గాయాలు కావడమే దీనికి ప్రధాన కారణం. 


రెండు వారాల కిందట ఆర్సీబీ  ఆల్ రౌండర్ విల్ జాక్స్.. గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జాక్స్ తో పాటు ఆసీస్ పేసర్ జోష్ హెజిల్‌వుడ్ కూడా గాయం కారణంగా  దూరమయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇప్పుడు మరో స్టార్ బ్యాటర్  కూడా ఆర్సీబీకి షాకిచ్చాడు.  గత సీజన్ లో   ఆర్సీబీ తరఫున అదరగొట్టిన (333 పరుగులు. ఇందులో ఓ మెరుపు సెంచరీ కూడా ఉంది)  రజత్ పాటిదార్ కూడా  ఈ సీజన్ తొలి భాగం  ఆడటం అనుమానమేనని వార్తలు వస్తున్నాయి.  కొద్దిరోజుల క్రితమే మడమ గాయంతో  బెంగళూరు  లోని  జాతీయ క్రికెట్ అకాడమీ  (ఎన్సీఏ)లో రిహాబిటేషన్  పొందుతున్న  పాటిదార్  ఐపీఎల్ లో  ఫస్టాఫ్ కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.   ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతడికి ఎన్సీఏ  క్లీయరెన్స్ సర్టిఫికెట్ అందించలేదు. 


పాటిదార్ ఆరోగ్య పరిస్థితిని ఎన్సీఏ వైద్యులు దగ్గరుండి సమీక్షిస్తున్నారు.  గాయం ఇంకా నయం కాకపోవడం వల్ల అతడు మరో మూడు వారాలు విరామం తీసుకుంటేనే మంచిదని  వైద్యులు అతడికి  సూచించారు. మరి దీనిపై పాటిదార్ ఏ నిర్ణయం తీసుకుంటాడో...! 


ఆసీస్ ప్లేయర్లూ అనుమానమే..!


ఆర్సీబీ కీలక బౌలర్ జోష్ హెజిల్వుడ్ కూడా ఇటీవల  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ కు వచ్చినా  మడమ గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.  ఢిల్లీ టెస్టు తర్వాత తిరిగి  సిడ్నీకి వెళ్లిన హెజిల్వుడ్.. వన్డే సిరీస్ కోసం కూడా రాలేదు.  అతడు కూడా పూర్తిస్థాయిలో కోలుకోలేదని సమాచారం.  ఇక గతేడాది  టీ20 ప్రపంచకప్  ముగిసిన తర్వాత ఓ బర్త్ డే పార్టీకి వెళ్లి అక్కడ గాయపడి  నాలుగైదు నెలలు  క్రికెట్ కు దూరమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా  ఈ సీజన్ లో తాను పూర్తి ఫిట్ గా లేనని చెప్పాడు. భారత్ తో  వన్డే సిరీస్ లో ఆడిన  అతడు..  రెండ్రోజుల క్రితమే ఆర్సీబీ క్యాంప్ లో చేరాడు.  ఐపీఎల్ ఆడేందుకు రానైతే వచ్చాను గానీ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని, దానికి ఇంకా చాలా కాలం టైమ్ పట్టేట్టు ఉందని అతడు వ్యాఖ్యానించడం  పలు అనుమానాలకు తావిస్తున్నది.  


కాగా ఇంగ్లాండ్ ఆటగాడు  విల్ జాక్స్ స్థానంలో కివీస్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్ ను  రిప్లేస్ చేసుకున్న  ఆర్సీబీ.. అతడి మీద భారీ ఆశలే పెట్టుకుంది.  మ్యాక్స్‌వెల్  ఆడకుంటే ఆ స్థానాన్ని బ్రాస్‌వెల్ భర్తీ చేస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఈ సీజన్ లో బెంగళూరు..  ఏప్రిల్  2న తమ స్వంత గ్రౌండ్  (చిన్నస్వామి స్టేడియం)  లో  ముంబై ఇండియన్స్ తో  ఆడే తొలి మ్యాచ్ తో సీజన్ మొదలుపెట్టనుంది.