IPL 2023:
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. 16 సీజన్లకు అత్యధికంగా డబ్బులు ఆర్జించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు ఎంఎస్ ధోనీని రెండో స్థానానికి నెట్టేశాడు. రాబోయే రెండు సీజన్లు ఆడితే హిట్‌మ్యాన్ ఖాతాలో మరింత సొమ్ము జమ అవుతుంది!
కోటీశ్వరుల ఆట!
ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించే క్రికెట్ లీగ్ ఐపీఎల్! 2008లో టోర్నీ ఆరంభమైన నాటి నుంచి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఉన్న వాటిని బద్దలు కొడుతోంది. ఈ భూమ్మీద అత్యంత విలువైన క్రికెట్ టోర్నీగా ఎదిగింది. ఆటగాళ్లకు ఫీజు చెల్లించడం నుంచి ప్రసార హక్కుల వరకు వేల కోట్ల రూపాయల్లోనే డీల్ చేస్తోంది. ఈ మధ్యే ఐపీఎల్ విలువ దాదాపుగా రూ.లక్ష కోట్లకు చేరువైంది. భారత జీడీపీ పెరుగుదలకు ఇతోధికంగా సాయపడుతోంది. అలాగే స్టార్ క్రికెటర్ల ఇంట డబ్బుల వర్షం కురిపించింది.
ఆర్జనలో హిట్‌మ్యాన్!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్. ఆ ఫ్రాంచైజీ ఐదు సార్లు ట్రోఫీ ముద్దాడిందంటే అందుకు రోహిత్ శర్మ నాయకత్వమే కారణం. ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించే హిట్‌మ్యాన్ బౌలర్లను సమయానికి తగినట్టు మారుస్తాడు. ప్రశాంతంగా ఉంటూనే పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు. ముంబయి తరఫున ఐదుసార్లు, డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నాడు. 16 సీజన్లకు రోహిత్ శర్మ రూ.178.6 కోట్లను వేతనంగా అందుకున్నాడు. ఎంఎస్ ధోనీని అధిగమించాడు. వచ్చే సీజన్ తర్వాత మహీ లీగ్ ఆడకపోవచ్చు. అప్పుడు రోహిత్‌ను వెనక్కినెట్టేవారే ఉండరు.
సంపాదనలో ధోనీ మ్యాజిక్!
ఇండియన్ ప్రీమియర్ లీగులో రెండో అత్యుత్తమ జట్టు చెన్నై సూపర్ కింగ్స్! ఏకంగా నాలుగు సార్లు విజేతగా ఆవిర్భవించింది. సపోర్ట్ స్టాఫ్‌లో ఎవ్వరున్నా ఎంఎస్ ధోనీ నాయకత్వమే వారిని విజేతలుగా మార్చింది. తన అత్యుత్తమ ఫినిషింగ్‌తో ఎంఎస్‌డీ ఎన్నోసార్లు మురిపించాడు. తొలిసారి రూ.6 కోట్లు అందుకున్న మహీ 2011 నుంచి రూ.8.28 కోట్లు, 2014 నుంచి రూ.12.5 కోట్లు, 2018 నుంచి రూ.15 కోట్లు తీసుకున్నాడు. 2022లో తన ఫీజును రూ.12 కోట్లకు తగ్గించుకున్నాడు. దీంతో అతడి సంపాదన రూ.176.84 కోట్లకు చేరుకుంది. బహుశా అతడికిదే చివరి సీజన్!