Rohit Sharma, IPL 2023:
ముంబయి ఇండియన్స్‌ను చూసి గర్విస్తున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. ఆటగాళ్లను ఎంతగానో ప్రశంసించాడు. గతేడాది చివరి ప్లేస్‌తో ముగించిన తాము.. ఇప్పుడు క్వాలిఫయర్-2కు చేరుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఆకాశ్ మధ్వాల్, నేహాల్ వధేరా స్పెషల్ కుర్రాళ్లని మెచ్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించాక మీడియాతో మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) అత్యంత విజయవంతమైన టీమ్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians). ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ గెలిచింది. అయితే సరైన ఆటగాళ్లు లేకపోవడంతో చివరి సీజన్లో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ సారీ అలాగే కనిపించింది. జస్ప్రీత్ బుమ్రా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వచ్చినా ఆడింది ఐదు మ్యాచులే. మళ్లీ మోచేతి గాయంతో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. జే రిచర్డ్సన్ సైతం అందుబాటులో లేడు. ఒకట్రెండు మ్యాచులకు తిలక్ వర్మ అందుబాటులో లేడు. అయినప్పటికీ ముంబయి రెండో క్వాలిఫయర్‌కు చేరుకోవడం ప్రత్యేకం.
లీగ్ ఆరంభంలో వరుస మ్యాచుల్లో ఓడిపోయినప్పుడు ప్లేఆఫ్స్ గురించి ఆలోచించామని రోహిత్ శర్మ (Rohit sharma) అంటున్నాడు. 'అవును, ప్లేఆఫ్‌కు చేరుకుంటామో లేదో అనిపించింది. అయితే అన్ని అడ్డంకుల్ని అధిగమించాం. ఆటగాళ్లను చక్కగా మేనేజ్ చేశాం. చివరి సీజన్‌తో పోలిస్తే చాలా మెరుగవ్వాలని అనుకున్నాం. ఇందుకోసం బాగా కష్టపడాల్సి ఉంటుందని తెలుసు. అన్ని అడ్డంకుల్నీ ఎదుర్కొన్నాం. ఒక్కోసారి ప్లాఫ్ అవ్వొచ్చు. దానికీ సిద్ధంగా ఉన్నాను' అని హిట్‌మ్యాన్ చెప్పాడు.
ఎవరికీ తెలియని కుర్రాళ్లు ఇంతలా మెరుస్తున్నారంటే ముంబయి ఇండియన్స్ స్కౌటింగ్ బృందమే కారణమని రోహిత్ వివరించాడు. నేహాల్ వధేరా, ఆకాశ్ మధ్వాల్ మ్యాచ్ విన్నర్లుగా అవతరించారని ప్రశంసించాడు. వాళ్లను కంఫర్టబుల్‌గా ఉంచాల్సిన బాధ్యత కెప్టెన్‌గా తనపైనే ఉంటుందన్నాడు. 'ముందు కుర్రాళ్లను సౌకర్యంగా ఉంచాలి. జట్టులో భాగంగా మార్చాలి. వారికి దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవం ఉంది. అయితే ఐపీఎల్ భిన్నమైంది. చాలా ప్రెజర్ ఉంటుంది. వారు ప్రణాళికలను సరిగ్గా అమలు చేసేందుకు కెప్టెన్, సపోర్ట్ స్టాఫ్ ఎంతో కష్టపడతారు. వాళ్ల పాత్రలను స్పష్టంగా వివరిస్తే ఆడటం సులభం అవుతుంది' అని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.
వాంఖడే వంటి స్టేడియాల్లో ఒకరిద్దరు ఆటగాళ్లు ఆడితే సరిపోతుందని రోహిత్ శర్మ చెప్పాడు. చెన్నై లాంటి పిచ్‌లపై ప్రతి ఒక్కరూ రాణించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. 'చిదంబరంలో మమ్మల్ని ఒక్కరే గెలిపించలేరని తెలుసు. అందుకే జట్టుగా పోరాడాలి. ఇలాంటి కండీషన్స్‌లో ఏదో ఒక దశలో అందరూ రాణించాలి. ఆకాశ్ మధ్వాల్ చివరి సీజన్లో సపోర్ట్ బౌలర్‌గా ఉన్నాడు. ఆడే అవకాశం రాలేదు. జోఫ్రా వెళ్లిపోవడంతో ఇంకొకరు కావాల్సి వచ్చింది. మధ్వాల్ ఎంతో తెలివైన వాడు. మంచి నైపుణ్యాలు ఉన్నాయి. అందుకే అతడిపై కాన్ఫిడెన్స్ ఉంది. లక్నోపై అతడి ప్రదర్శన అమోఘం' అని మెచ్చుకున్నాడు.
Lucknow Super Giants vs Mumbai Indians Eliminator: ఐపీఎల్ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.