Abhishek Sharma SRH Captain: ఐపీఎల్‌ 2023 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రిపరేషన్స్‌ ఆరంభించింది. ఎక్కువ డబ్బులు పెట్టినా జిడ్డుగా ఆడిన ఆటగాళ్లను వదిలించుకుంది. ఇక నుంచి కుర్రాళ్లపై భారం వేయనుంది. ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయిన కేన్‌ విలియమ్సన్‌ను వేలంలోకి వదిలేసింది. దాంతో వచ్చే సీజన్లో జట్టును నడిపించే నాయకుడు ఎవరన్న సందేహాలు మొదలయ్యాయి. 'వీర శూర' అన్న ఇండికేషన్స్‌ గమనిస్తుంటే పంజాబ్‌ కర్రాడు అభిషేక్ శర్మకే పగ్గాలు అప్పగించేలా కనిపిస్తోంది.




గత సీజన్లో ఓపెనింగ్‌


అభిషేక్‌ శర్మ! ఈ పేరు గుర్తుందా? గతేడాది హైదరాబాద్‌కు ఓపెనింగ్‌ చేశాడు. మొదటి మూడు మ్యాచుల్లో పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. అతడికి తోడుగా కేన్‌ విలియమ్సన్‌ ఓపెనింగ్‌కు రావడం మరో మైనస్‌! కుర్రాడైన అభిషేక్‌ తొలుత ఒత్తిడికి గురయ్యాడు. ఎప్పుడైతే భయాన్ని అధిగమించాడో పరుగుల వరద పారించాడు. మిస్టరీ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు మిగతావాళ్లు జంకుతుంటే అతడేమో క్రిస్‌గేల్‌ తరహాలో ఎదురుదాడికి దిగాడు. 2018 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నా 2022లోనే ఓపెనింగ్‌ ఛాన్స్‌లు వచ్చాయి. ఈ సీజన్లో 14 మ్యాచులాడి 133 స్ట్రైక్‌రేట్‌తో 426 రన్స్‌ చేశాడు. వేగంగా లెఫ్ట్‌ఆర్మ్‌ బౌలింగ్‌ చేయడం అదనపు ప్రయోజనం. అందుకే వచ్చే సీజన్లో ఇతడికే పగ్గాలు అప్పగిస్తారని సమాచారం.


పంజాబ్‌కు కెప్టెన్‌


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. అందుకే అభిషేక్‌ను నాయకత్వ బృందంలోకి పరిగణలోకి తీసుకుంటోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో అతడు పంజాబ్‌కు కెప్టెన్సీ చేస్తున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగలడు. క్రికెట్‌పై మంచి పరిజ్ఞానం ఉంది. అండర్‌-16 నుంచి తానాడిన జట్లకు నాయకత్వం వహించాడు. మ్యాచ్‌ సిచ్యువేషన్స్‌ను అర్థం చేసుకోగలడు. అంతకు మించి వెస్టిండీస్‌ దిగ్గజం, హైదరాబాద్‌ కోచ్‌ బ్రియన్‌ లారాతో సాన్నిహిత్యం కుదిరింది. ఇక టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అతడికి వ్యక్తిగత మెంటార్‌గా ఉన్నాడు. వీరందరి శిక్షణలో అతడు రాటుదేలుతున్నాడు.


బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఫామ్‌


ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో అభిషేక్‌ నిలకడగా రాణిస్తున్నాడు. 10 మ్యాచుల్లో 127 స్ట్రైక్‌రేట్‌, 37 సగటుతో 259 పరుగులు చేశాడు. రెండు అర్ధశతకాలు సాధించాడు. ఇక 30 ఓవర్లు విసిరి 5.10 ఎకానమీ, 15.30 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. 153 రన్స్‌ ఇచ్చాడు. 3/22 బెస్ట్‌. ఇటు బ్యాటింగ్‌లో ఓపెనింగ్‌ చేయగలడు. ఫుల్‌టైమ్‌ స్పిన్నర్‌ లేదా పార్ట్‌ టైమ్ స్పిన్నర్‌గా వికెట్లు తీయగలడు. ఏజ్‌ వైస్ క్రికెట్లో కెప్టెన్సీ చేసిన నైపుణ్యం ఉంది. దేశవాళీ సెట్‌ప్‌లో పంజాబ్‌నే నడిపిస్తున్నాడు. ఈ క్వాలిటీస్‌ ఉన్నాయి కాబట్టే హైదరాబాద్‌ అతడిపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తోంది. అదృష్టం, శ్రమ కలిసి అభిషేక్‌ అన్ని విభాగాల్లో రాణిస్తే ఫ్రాంచైజీతో పాటు టీమ్‌ఇండియాకూ మేలు జరుగుతుంది. ఓ లెఫ్టాండ్‌ ఓపెనర్‌, స్పిన్నర్‌ దొరుకుతాడు.