Arjun Tendulkar Mumbai Indians IPL 2023: అర్జున్ టెండూల్కర్ ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అతను ముంబై ఇండియన్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు. అర్జున్ బౌలింగ్‌ను పలువురు క్రికెటర్లు ప్రశంసించారు. అయితే అతని బౌలింగ్‌పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఘాటుగా స్పందించాడు. అర్జున్ తన బౌలింగ్ యాక్షన్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని రషీద్ లతీఫ్ చెప్పాడు. అలా చేయకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చని అభిప్రాయపడ్డాడు. అర్జున్ దేశవాళీ మ్యాచ్‌ల్లో ముంబై తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టులో భాగం అయ్యాడు.


తన బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాలని రషీద్ లతీఫ్ అర్జున్‌కు సూచించాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌పై మాట్లాడుతూ, "ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది. అతను కష్టపడి పనిచేయాలి. అతను బంతిని ఎక్కువ వేగంతో వేయలేకపోతున్నాడు. కానీ అతను తన బౌలింగ్‌లో వేగాన్ని పెంచగలడు. కోచింగ్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది." అన్నారు.


ఇంకా మాట్లాడుతూ “దానికి పునాది బలంగా ఉండాలి. అతని బ్యాలెన్స్ సరిగ్గా లేదు. ఇది బౌలింగ్‌లో వేగంపై ప్రభావం చూపుతుంది. కానీ అతను ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు. గంటకు 135 కిలో మీటర్ల వేగంతో బంతిని విసురుతున్నాడు. అలాగే అతను మంచి బ్యాట్స్‌మెన్ కూడా. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో మంచి ఆటగాడిగా మారగలడు. అతను మరేదైనా ఫ్రాంచైజీ కోసం ఆడుతూ ఉంటే అతని వైఖరి భిన్నంగా ఉండేది. ప్రస్తుతం అతని తండ్రి (సచిన్ టెండూల్కర్) కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో భాగమే." అని తెలిపారు.


ఇప్పటివరకు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్జున్ టెండూల్కర్ 12 వికెట్లు తీశాడు. అలాగే ఏడు లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. అతని మొత్తం టీ20 ప్రదర్శన కూడా బాగానే ఉంది. అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అర్జున్ టెండూల్కర్ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.


అర్జున్‌ టెండూల్కర్ ఐపీఎల్‌ అరంగేట్రం తనకో సరికొత్త అనుభూతి అని సచిన్‌ టెండూల్కర్ అన్నాడు. గతంలో అతడి ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచులో అతడి ప్రదర్శనను డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచే చూశానని వెల్లడించాడు. అతడి ప్రణాళికలు మార్చుకోవద్దనే నేరుగా మ్యాచును చూడలేదని స్పష్టం చేశాడు. కోల్‌కతాపై ముంబయి ఇండియన్స్‌ విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


గతేడాది వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను (Arjun Tendulkar) ముంబయి ఇండియన్స్‌ వేలంలో కొనుగోలు చేసింది. అప్పుడే ఆడిస్తారని అంతా భావించారు. ఒక మ్యాచులో ఆడిస్తారని తెలియడంలో కుటుంబ సభ్యులు వచ్చేశారు. అయితే ఆఖరి క్షణాల్లో ప్లాన్‌లో మార్పు చేశారు. దాంతో అతడి అరంగేట్రం ఈ సీజన్‌కు వాయిదా పడింది. 2008 నుంచి సచిన్‌ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్‌తోనే (Mumbai Indians) ఉన్నాడు. ఆటగాడిగా, మెంటార్‌గా దానికే సేవలు అందిస్తున్నాడు.