ఐపీఎల్-16లో కేఎల్ రాహుల్ తన ఆటతో విసుగుకే విసుగు తెప్పిస్తున్నాడు. తెలుగులో అప్పుడెప్పుడో వచ్చిన అమృతం సీరియల్ లో శివాజీ రాజా ఓపెనింగ్ బ్యాటర్ గా వచ్చి చివరి దాకా ఔట్ కాకుండా పరుగులేమీ చేయకుండా క్రీజులో పాతుకుపోయిన సీన్‌ను పదే పదే గుర్తుకు తెస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 10-12 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా చేసేది 30, 40 పరుగులే. ఒక్కోసారి అది కూడా లేదు. బుధవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కూడా రాహుల్ మరో జిడ్డు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాహుల్‌పై మాజీ ఆటగాళ్లు విమర్శల వాడిని పెంచారు.
రాజస్తాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాహుల్.. 32 బంతులాడి 4 బౌండరీలు, ఒక సిక్సర్‌తో ద 39 పరుగులు చేశాడు. రెండు సార్లు లైఫ్ వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేదు. రాహుల్ ఆట చూసి విసుగొచ్చిన ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కామెంట్రీ చెబుతూ అసహనానికి గురయ్యాడు. రాహుల్ ఆట చూస్తే పరమబోరింగ్‌గా ఉందని వాపోయాడు.
కామెంట్రీ బాక్స్‌లో ఉన్న పీటర్సన్.. ‘పవర్ ప్లే లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూడటం పరమబోరింగ్‌గా ఉంటుంది. గతంలో నేనెప్పుడూ ఇంత చెత్త ఆట చూడలేదు’అని వ్యాఖ్యానించాడు. పీటర్సన్ చెప్పినట్టు పవర్ ప్లే లో రాహుల్ ఆట మరీ పేలవంగా ఉంది. ఒకవైపు తన ఓపెనింగ్ పెయిర్ కైల్ మేయర్స్ ఉన్నంతలో బాదుడుకే ప్రాధాన్యమిస్తుంటే రాహుల్ మాత్రం డిఫెన్స్‌తో చిరాకు తెప్పిస్తున్నాడు. ఏ జట్టుకైనా బ్యాటింగ్ పవర్ ప్లే చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్‌కు భారీ స్కోరు సాధించాలంటే పవర్ ప్లేలో భారీగా బాదాల్సిందే. కానీ రాహుల్ పుణ్యమా అని లక్నోకు ఆ అవకాశమే లేకుండా పోతోంది. దీంతో రాహుల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ జిడ్డు బ్యాటింగ్‌తో రాహుల్.. ట్రోలర్స్‌కు నిత్యం చేతినిండా పని కల్పిస్తున్నాడు.
ఆ చెత్త ఘనత కూడా అతడి పేరు మీదే..
ఈ సీజన్ లో మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. అత్యధిక పరుగులు చేసిన టాప్ -15 బ్యాటర్లలో 11 వ స్థానంలో ఉన్నాడు. 6 మ్యాచ్ లలో రాహుల్ 194 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి స్ట్రైక్ రేట్ 114.79గా నమోదైంది. టాప్ -15లో ఇంత తక్కువ స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్ లక్నో సారథే.
ఇక నిన్నటి మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్ లో రాహుల్ పరుగులేమీ చేయలేదు. ఈ ఓవర్ మెయిడిన్ అయింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఘనత ఉన్న బ్యాటర్ అతడే. రాహుల్ 14 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. అలాంటి రాహుల్ ఇప్పుడు ఎలా అయిపోయాడు..! రాహుల్ ప్రదర్శన చూశాక అతడి అభిమానులు కూడా ‘ఎసొంటెసొంటి ఇన్నింగ్స్ ఆడేటోనివన్న.. ఏం హాలత్ అయిపాయే..’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.