Apple CEO Tim Cook: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘యాపిల్’ సంస్థ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటనలో ఉన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తొలి యాపిల్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించడంతో పాటు ఇతర వ్యాపార కార్యకలాపాల నిమిత్తం భారత పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లోని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అకాడమీకి వెళ్లి అక్కడ సందడి చేశారు.
మంగళవారం ఉదయమే గోపీచంద్ అకాడమీకి వెళ్లిన ఆయన అక్కడ భారత గోపీతో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ కిదాంబి, చిరాగ్ శెట్టి, పారుపల్లి కశ్యప్ లతో ముచ్చటించారు. అకాడమీలో శిక్షణ పొందుతున్న చిన్నారులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాకెట్ పట్టి కాసేపు తన ఆటతో కూడా అలరించారు.
టిమ్ కుక్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ.. ‘బ్యాడ్మింటన్‌లో తమ ఆటతో దేశానికి విశేష సేవలందిస్తున్న కోచ్ గోపీచంద్‌తో పాటు ఛాంపియన్స్ సైనా నెహ్వాల్, శ్రీకాంత్ కిదాంబి, చిరాగ్ శెట్టి, పారుపల్లి కశ్యప్ లతో సమావేశం బాగా జరిగింది. ఈ సందర్భంగా యాపిల్ వాచెస్ వారికి ట్రైనింగ్‌లో ఎలా ఉపయోగపడిందో మేము చర్చించుకున్నాం..’ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బ్యాడ్మింటన్ లో ఉపయోగించే సర్వ్, స్మాష్ పదాలను వాడుతూ.. ‘మేం సర్వ్ చేశాం, స్మాష్ చేశాం’ అని శ్రీకాంత్, ఇతర ఆటగాళ్లతో బ్యాడ్మింటన్ ఆడిన చిత్రాలను షేర్ చేశారు.
కాగా సోమవారం టిమ్ కుక్.. భారత్ లోనే మొదటి యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో ‘యాపిల్ బీకేసీ’ని ఆయన ప్రారంభించారు. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా స్వయంగా ఆయనే తలుపులు తెరిచి వినియోగదారులను లోనికి ఆహ్వనించారు. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ముంబైవాసులే గాక యాపిల్ ప్రొడక్ట్స్ ను ఇష్టపడే చాలామంది దేశ ఆర్థిక రాజధానికి వచ్చారు. ఈ స్టోర్ ఓపెనింగ్ తర్వాత కుక్.. ప్రముఖ బాలీవుడ్ నటి మాదురీ దీక్షిత్ తో కలిసి ముంబై ఫేమస్ వంటకం వడపావ్ తిన్నారు. ఇండియాలో యాపిల్ ప్రొడక్ట్స్‌కు మంచి గిరాకీ ఉండటంతో ఇక్కడ తన మార్కెట్‌ను విస్తరించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.