IPL 2023, LSG vs MI: 


కఠిన పిచ్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్‌ అదరగొట్టింది! ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకెళ్లింది. భీకరమైన ముంబయి ఇండియన్స్‌ను వెనక్కి నెట్టింది. చావోరేవోగా మారిన మ్యాచులో 177 స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకుంది. హిట్‌మ్యాన్‌ సేనను 172/5కి పరిమితం చేసింది. ఇషాన్‌ కిషన్‌ (59; 39 బంతుల్లో 8x4, 1x6), రోహిత్‌ శర్మ (37; 25 బంతుల్లో 1x4, 3x6) అదరగొట్టారు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (32*; 19 బంతుల్లో 1x4, 3x6) భయపెట్టాడు. అంతకు ముందు ఎల్‌ఎస్‌జీలో మార్కస్‌ స్టాయినిస్‌ (89*; 47 బంతుల్లో 4x7, 8x6) విశ్వరూపం ప్రదర్శించాడు. కృనాల్‌ పాండ్య (49; 42 బంతుల్లో 1x4, 1x6) అతడికి అండగా నిలిచాడు.


భయపెట్టిన ముంబయి!


ట్రిక్కీ టార్గెట్‌ ఛేజింగ్‌ను ముంబయి మెరుగ్గా ఆరంభించింది. రెండో ఓవర్‌ నుంచే ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ చితకబాదడం షురూ చేశారు. రన్‌రేట్‌ను 10కి పైగా కొనసాగించారు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఎంఐ వికెట్లేమీ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ఆ తర్వాతా వీరిద్దరూ ఇదే జోరు కొనసాగించారు. తొలి వికెట్‌కు 58 బంతుల్లో 90 పరుగుల అమేజింగ్‌ పాట్నర్‌షిప్‌ నెలకొల్పారు. 9.4వ బంతికి రోహిత్‌ను ఔట్‌ చేసి రవి బిష్ణోయ్‌ బ్రేకిచ్చాడు. మరోవైపు సూర్యకుమార్‌ (7) అండతో కిషన్‌ 34 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. అతడి ధాటికి హిట్‌మ్యాన్‌ సేన ఈజీగా గెలుస్తుందని అనిపించింది.


మొహిసిన్‌ మాయ


జట్టు స్కోరు 103 వద్ద ఇషాన్‌ను బిష్ణోయే బోల్తా కొట్టించాడు. యశ్‌ ఠాకూర్‌ వేసిన ఓ  అద్భుతమైన బంతిని ఫైన్‌లెగ్‌లోకి ఆడబోయి సూర్య బౌల్డ్‌ అయ్యాడు. కాసేపు నిలిచిన నేహాల్‌ వధేరా (16)ను మొహిసిన్ ఖాన్‌ పెవిలియన్‌ పంపించాడు. అప్పటికి స్కోరు 16.1 ఓవర్లకు 131. మరో 14 పరుగులకే విష్ణు వినోద్‌ (2)ను ఠాకూర్‌ ఔట్‌ చేసి ప్రెజర్‌ పెంచాడు. దీంతో గెలుపు సమీకరణం 12 బంతుల్లో 30గా మారింది. టిమ్‌ డేవిడ్‌ రెండు సిక్సర్లు బాదడం.. నోబాల్‌ బౌండరీకి వెళ్లడంతో 19 రన్స్‌ వచ్చాయి. ముంబయికి 6 బంతుల్లో 11 రన్స్‌ అవసరం కాగా మొహిసిన్ ఖాన్‌ 5 పరుగులు ఇచ్చి లక్నోను గెలిపించాడు.


ఓపెనర్లు విఫలం


టాస్‌ ఓడిన లక్నో మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. పవర్‌ప్లే ముగిసే సరికే 2 వికెట్లు నష్టపోయి 35 పరుగులు చేసింది. టాప్‌-3 ఆటగాళ్లు ఇంపాక్టేమీ చూపించలేదు. జట్టు స్కోరు వద్దే దీపక్‌ హుడా (5), ప్రేరక్‌ మన్కడ్‌ (0) వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. స్పిన్‌ ఆడేందుకు ఇబ్బంది పడ్డ క్వింటన్‌ డికాక్‌ (16)ను పియూష్‌ చావ్లా 6.1వ బంతికి ఔట్‌ చేశాడు. పిచ్‌ చాలా కఠినంగా ఉండటం.. ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో లక్నో స్కోరు నెమ్మదించింది.


కృనాల్‌ కీలకం


ఇలాంటి టఫ్‌ కండీషన్స్‌లో కెప్టెన్‌ కృనాల్‌ పాండ్య, మార్కస్‌ స్టాయినిస్‌ నిలిచారు. చక్కని బంతుల్ని డిఫెండ్‌ చేశారు. చెత్త బంతుల్ని వేటాడారు. నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 82 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దాంతో 9 ఓవర్లకు లక్నో 63/3తో నిలిచింది. లూజ్‌ ఓవర్‌ దొరికేంత వరకు ఈ ఇద్దరూ తొందర పడలేదు. తెలివిగా అటాక్‌ చేసి పరుగులు రాబట్టారు. 14 ఓవర్లకు స్కోరును 100కు చేర్చారు. సరిగ్గా హాఫ్‌ సెంచరీ ముందు పిక్కలు పట్టేయడంతో కృనాల్ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 117/3.


హల్క్‌ ఇన్నింగ్స్‌


నికోలస్‌ పూరన్‌ (8*) వచ్చాక.. 15 ఓవర్లు దాటాక.. మార్కస్‌ స్టాయినిస్‌ తన విధ్వంసాన్ని చూపించాడు. బ్యాటింగ్‌ చేసేందుకు కష్టంగా అనిపిస్తున్న పిచ్‌పై 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. అదీ సిక్సర్‌తో. ఆ తర్వాత మరింత చెలరేగాడు. క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 18వ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు, మూడు బౌండరీలు బాదేసి 24 పరుగులు రాబట్టాడు. బెరెన్‌డార్ఫ్‌ వేసిన 19వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతినీ స్టాండ్స్‌లో పెట్టేసి జట్టు స్కోరును 177/3కు చేర్చాడు. ఇలాంటి స్లగ్గిష్ పిచ్‌పై ఇది టఫ్‌ టార్గెట్టే!