IPL 2023, LSG vs MI: 


ఏకనా వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్‌ టాస్‌ వేశారు. టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. పిచ్‌ చూడ్డానికైతే బాగుందని, ఎలా స్పందిస్తుందో తెలియదని పేర్కొన్నాడు. నలుగురు సీమర్లు,  ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నామని తెలిపాడు.


'మేం మొదట ఫీల్డింగ్‌ చేస్తాం. పిచ్‌ నుంచి ఏం ఆశించాలో తెలుసు. వికెట్‌ చూడ్డానికి బాగుంది. ఎలా స్పందిస్తుందో తెలియదు. అందుకే మా ముందు ఓ టార్గెట్‌ ఉంటే మంచిదని అనుకుంటున్నాం. ఈ సవాల్‌కు మేం సిద్ధం. సీమర్లు ఇక్కడ సమర్థంగా ఉన్నారు. అందుకే మేం నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను తీసుకుంటున్నాం. ప్రతి మ్యాచ్‌ మాకు కీలకమే. తమదైన రోజున ఎవరు ఎవరినైనా ఓడించగలరు. మేం ఒక మార్పు చేశాం. లెఫ్టార్మ్‌ సీమర్‌ ప్లేస్‌లో ఆఫ్‌ స్పిన్నర్‌ వస్తున్నాడు' అని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు.


'మేం టాస్‌ ఓడిపోవడం మంచిదే అయింది. ఎలాగైనా మేం మొదట బ్యాటింగే చేయాలనుకున్నాం. ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌ కీలకమే. జట్టులో కొన్ని మార్పులు చేశాం. నవీన్‌ ఉల్‌ హఖ్‌ వస్తున్నారు. కైల్‌ మేయర్‌, అవేశ్‌ ఖాన్‌ ఆడటం లేదు. మరో మార్పు కూడా చేశాం. కానీ గుర్తు లేదు. అందరూ ఫిట్‌గా ఉన్నారు' అని లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్ కృనాల్‌ పాండ్య పేర్కొన్నాడు.


ముంబయి ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్‌ యాదవ్‌, నేహాల్‌ వధేరా, టిమ్‌ డేవిడ్‌, హృతిక్‌ షోకీన్‌, క్రిస్‌ జోర్డాన్‌, పియూష్‌ చావ్లా, జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌, ఆకాశ్ మధ్వాల్‌


లక్నో సూపర్‌ జెయింట్స్‌: క్వింటన్‌ డికాక్‌, దీపక్‌ హుడా, ప్రేరక్‌ మన్కడ్‌, కృనాల్‌ పాండ్య, మార్కస్‌ స్టాయినిస్‌, నికోలస్‌ పూరన్‌, ఆయుష్ బదోనీ, నవీనుల్‌ హఖ్‌, రవి బిష్ణోయ్, స్వప్నిల్‌ సింగ్‌, మొహిసిన్ ఖాన్‌


సొంత గ్రౌండ్ లో  ఆడుతుండటం లక్నోకు బలమే అయినా అదే బలహీనత అని కూడా చెప్పక తప్పదు. ఇక్కడ ఆరు మ్యాచ్ లు ఆడిన  లక్నో  రెండింట మాత్రమే గెలిచింది. గుజరాత్, బెంగళూరు, పంజాబ్  చేతిలో ఓడింది.  చెన్నైతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.  ఓడిన మూడు మ్యాచ్ లలో  లక్నో ఛేదన చేసే క్రమంలో  తడబాటుకు గురై  విజయం ముంగిట బోల్తా కొట్టింది. ఆ జట్టు గత మ్యాచ్ లో  సన్ రైజర్స్ ను ఓడించినా  లక్నోలో ఎలా ఆడతారనేది ఆసక్తికరం.  స్లోపిచ్ పై కైల్ మేయర్స్,  స్టోయినిస్,  పూరన్ లు ముంబై స్పిన్నర్లను తట్టుకుని ఏ మేరకు నిలబడగలరనేది చూడాలి.


ఈ మ్యాచ్ లో  ముంబై గెలిస్తే అది టాప్ -2కు వెళ్లే అవకాశం ఉంది.   ప్రస్తుతం చెన్నైకి 15, ముంబైకి  14 పాయింట్లున్నాయి. ఇక లక్నో గెలిస్తే.. ముంబైని వెనక్కినెట్టి టాప్ -3కి వెళ్లడమే గాక ప్లేఆఫ్స్ బెర్త్ ను మరింత  ఖాయం చేసుకుంటుంది.  ఒకవేళ లక్నో ఓడితే మాత్రం  ఆ జట్టుకు  ఆర్సీబీ, రాజస్తాన్  తో  నాలుగో స్థానానికి పోటీ తప్పకపోవచ్చు.