IPL 2023, RCB vs KKR: 


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలకు తెరపడింది! చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ సేన 21 రన్స్‌ తేడాతో ఓటమి చవిచూసింది. కోల్‌కతా చేతిలో రెండోసారీ భంగపడింది. 201 రన్‌ ఛేజ్‌లో ఆర్సీబీ 179/8కి పరిమితమైంది. విరాట్‌ కోహ్లీ (54; 37 బంతుల్లో 6x4) ఒక్కడే పోరాడాడు. మహిపాల్‌ లోమ్రర్‌ (34; 18 బంతుల్లో 1x4, 3x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు కేకేఆర్‌లో ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (56; 29 బంతుల్లో 4x4, 5x6) డిస్ట్రక్టివ్‌ ఓపెనింగ్‌ ఇచ్చాడు. వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (48; 21 బంతుల్లో 3x4, 4x6), వెంకటేశ్‌ అయ్యర్‌ (31; 26 బంతుల్లో 3x4) చక్కని ఇన్నింగ్సులతో మెరిశారు.




కేజీఎఫ్‌ ఔట్‌!


ఒక పెద్ద టార్గెట్‌ ఛేజ్‌ చేయాలంటే సమష్టిగా పోరాడాలి! ఆర్సీబీలో అదే కొరవడింది. పదేపదే ముగ్గురి పైనే ఆధారపడటం వారి కొంపముంచింది! తొలి రెండు ఓవర్లు విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌ (17) చితకబాదడంతో 30 రన్స్‌ వచ్చాయి. మూడో ఓవర్లో స్పిన్నర్‌ను దించగానే వికెట్ల పతనం మొదలైంది. 2.2వ బంతికి డుప్లెసిస్‌ను సుయాశ్‌ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ (2)నూ అతడే పెవిలియన్‌ పంపించాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన 5.5వ బంతికి మాక్స్‌వెల్‌ (5) వికెట్‌ ఇచ్చేశాడు. అయినప్పటికీ రన్‌రేట్‌ మెరుగ్గా ఉందంటే అందుకు కోహ్లీనే కారణం. చక్కని బౌండరీలతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీని 58/3తో నిలిపాడు.


మిడిలార్డర్‌ కొలాప్స్‌!


ఈ సిచ్యువేషన్లో మహిపాల్ లోమ్రర్‌తో కలిసి విరాట్‌ నాలుగో వికెట్‌కు 34 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. జట్టును ఎలాగైనా గెలిపించాలన్న ఇంటెంట్‌ చూపించాడు. అయితే 113 వద్ద లోమ్రర్‌, 115 వద్ద విరాట్‌ ఔటవ్వడంతో ఆర్సీబీపై ఒత్తిడి పెరిగింది. దినేశ్‌ కార్తీక్‌ (22; 18 బంతుల్లో 1x4, 1x6) ఆదుకొనే ప్రయత్నం చేసినా కుదర్లేదు. జట్టు స్కోరు 154 వద్ద అతడిని వరుణ్ చక్రవర్తి ఔట్‌ చేసి కథ ముగించాడు. విజయ సమీకరణం చివరి 6 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా ఆర్సీబీ 13 పరుగులే చేసి 179/8కి సెటిల్‌ అయింది.




రప్ఫాడించిన రాయ్‌


టాస్‌ ఓడిని కేకేఆర్‌ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. తొలి రెండు ఓవర్లు పెద్ద స్కోరేమీ రాలేదు. ఆ తర్వాతే అసలైన ఊచకోత మొదలైంది. ఇంగ్లాండ్‌ డిస్ట్రక్టివ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌.. రఫ్ఫాడించాడు. దొరికిన బంతిని దొరికినట్టే కొట్టాడు. షాబాజ్‌ వేసిన పవర్‌ ప్లే ఆఖరి ఓవర్లో అయితే సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. దాంతో 6 ఓవర్లకు కేకేఆర్‌ 66/0తో నిలిచింది. రాయ్‌ 22 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (27; 29 బంతుల్లో)తో కలిసి తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే పదో ఓవర్లో 4 పరుగుల వ్యవధిలో వీరిద్దరినీ వైశాక్‌ పెవిలియన్‌ పంపించాడు.


రాణా.. అయ్యర్‌ స్పెషల్‌


ఓపెనర్లు ఔటయ్యాక కెప్టెన్‌ నితీశ్‌ రాణా, వెంకటేశ్‌ అయ్యర్‌  స్కోర్‌ బోర్డును పరుగెత్తించే బాధ్యత తీసుకున్నారు. క్రీజులో అలవాటు పడగానే నితీశ్ రాణా వీరబాదుడు షురూ చేశాడు. చక్కని లాఫ్టెడ్‌ షాట్లతో అలరించాడు. అయ్యర్‌ సైతం షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 44 బంతుల్లో 80 పరుగుల పాట్నర్‌ షిప్‌ అందించారు. దాంతో కేకేఆర్‌ 15.6 ఓవర్లకు 150కి చేరుకుంది. ప్రమాదకరంగా మారిన రాణా, అయ్యర్‌ జోడీని 18వ ఓవర్లో ఒక పరుగు వ్యవధిలో హసరంగ ఔట్‌ చేశాడు. ఆఖర్లో రింకూ సింగ్‌ (18*; 10 బంతుల్లో 2x4, 1x6), డేవిడ్‌ వైస్‌ (12*; 3 బంతుల్లో 2x6) సిక్సర్లు బాదేసి జట్టు స్కోరును 200/5కు తీసుకెళ్లారు.