IPL 2023, RCB vs KKR:
చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ సిక్సర్ల వర్షం కురిసింది. బౌండరీల వరద పారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెచ్చిపోయింది. కోహ్లీసేనకు 201 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్ జేసన్ రాయ్ (56; 29 బంతుల్లో 4x4, 5x6) డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ ఇచ్చాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. కెప్టెన్ నితీశ్ రాణా (48; 21 బంతుల్లో 3x4, 4x6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడేశాడు. వెంకటేశ్ అయ్యర్ (31; 26 బంతుల్లో 3x4) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. వైశాక్, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
దంచికొట్టిన రాయ్!
టాస్ ఓడిని కేకేఆర్ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. తొలి రెండు ఓవర్లు పెద్ద స్కోరేమీ రాలేదు. ఆ తర్వాతే అసలైన ఊచకోత మొదలైంది. ఇంగ్లాండ్ డిస్ట్రక్టివ్ ఓపెనర్ జేసన్ రాయ్.. రఫ్ఫాడించాడు. దొరికిన బంతిని దొరికినట్టే కొట్టాడు. షాబాజ్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో అయితే సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. దాంతో 6 ఓవర్లకు కేకేఆర్ 66/0తో నిలిచింది. రాయ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (27; 29 బంతుల్లో)తో కలిసి తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే పదో ఓవర్లో 4 పరుగుల వ్యవధిలో వీరిద్దరినీ వైశాక్ పెవిలియన్ పంపించాడు.
రాణా.. అయ్యర్ రెస్పాన్సిబిలిటీ
ఓపెనర్లు ఔటయ్యాక కెప్టెన్ నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ స్కోర్ బోర్డును పరుగెత్తించే బాధ్యత తీసుకున్నారు. క్రీజులో అలవాటు పడగానే నితీశ్ రాణా వీరబాదుడు షురూ చేశాడు. చక్కని లాఫ్టెడ్ షాట్లతో అలరించాడు. అయ్యర్ సైతం షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 44 బంతుల్లో 80 పరుగుల పాట్నర్ షిప్ అందించారు. దాంతో కేకేఆర్ 15.6 ఓవర్లకు 150కి చేరుకుంది. ప్రమాదకరంగా మారిన రాణా, అయ్యర్ జోడీని 18వ ఓవర్లో ఒక పరుగు వ్యవధిలో హసరంగ ఔట్ చేశాడు. ఆఖర్లో రింకూ సింగ్ (18*; 10 బంతుల్లో 2x4, 1x6), డేవిడ్ వైస్ (12*; 3 బంతుల్లో 2x6) సిక్సర్లు బాదేసి జట్టు స్కోరును 200/5కు తీసుకెళ్లారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహిపాల్ లోమ్రర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్
కోల్‌కతా నైట్‌రైడర్స్: జగదీశన్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి