IPL 2023 Points Table: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023 సీజన్‌ సగం ముగిసింది. టోర్నీ.. నిన్నా మొన్నే మొదలైనట్టు అనిపిస్తోంది! గతంతో పోలిస్తే ఈ సారి మ్యాచులు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. 200 + స్కోర్లు నమోదవుతున్నాయి. హోమ్ అడ్వాండేజీ అంతగా ఉండటం లేదు. ఛేదన చేస్తే కచ్చితంగా గెలుస్తామన్న ధీమా కనిపించడం లేదు. దాంతో పాయింట్ల పట్టిక ఎగ్జైటింగ్‌గా మారింది. ఫస్ట్‌ హాఫ్‌లో చెన్నై సూపర్‌ కింగ్సే విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉంది.


2 జట్లు 5 విజయాలు


గాయపడ్డ ఆటగాళ్లు.. బంతి పట్టుకోని ఆల్‌రౌండర్లు.. వయసు మీదపడ్డ క్రికెటర్లు.. అయినా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమేజింగ్‌ పెర్ఫామెన్స్‌ చేస్తోంది. తొలి 7 మ్యాచుల్లో 5 గెలిచి కేవలం 2 ఓడింది. 0.662 రన్‌రేట్‌తో 10 పాయింట్లతో నంబర్‌ వన్‌ పొజిషన్లో ఉంది. తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్ 7 మ్యాచుల్లో 5 గెలిచి 2 ఓడింది. 0.580 రన్‌రేట్‌తో 10 పాయింట్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. తర్వాతి మ్యాచులో కేకేఆర్‌తో తలపడనుంది.


4 జట్లు 8 పాయింట్లు


ఈ సీజన్లో ఏకంగా నాలుగు జట్లు ఎనిమిది పాయింట్లతో వరుసగా 3, 4, 5, 6 స్థానాల్లో ఉన్నాయి. మెరుపు ఆరంభాలతో రెచ్చిపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఆఖరి రెండు మ్యాచుల్లో వరుసగా ఓటమి పాలైంది. నంబర్‌ వన్‌ పొజిషన్‌ను పోగొట్టుకుంది. మూడో ప్లేస్‌లో ఉంది. మిగిలిన సీజన్లో కొన్ని మంచి విజయాలు సాధిస్తే పైకి వెళ్లడం ఖాయం. లక్నో సూపర్‌ జెయింట్స్‌ నాలుగో ప్లేస్‌లో ఉంది. నిజానికి ఈ టీమ్‌ అన్నీ మ్యాచుల్లో గెలవాల్సింది. మూడు మ్యాచుల్లో అవకాశాల్ని చేజేతులా వదిలేసింది. సీఎస్కేపై ఛేజింగ్‌లో, పంజాబ్‌ కింగ్స్‌పై డిఫెండింగ్‌లో మూమెంటమ్‌ కోల్పోయింది. లేటెస్టుగా గుజరాత్‌ మ్యాచులోనూ ఆఖరి ఓవర్లో కొలాప్స్‌ అయింది.


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచులకు విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ వహించాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ విన్స్‌ అందించాడు. ఆర్సీబీని ప్లేఆఫ్‌ రేసులో ఉంచాడు. బౌలింగ్‌ కూడా ఎంతో మెరుగైంది. తర్వాతి మ్యాచులో కేకేఆర్‌ను ఢీకొట్టనుంది. గతంతో పోలిస్తే పంజాబ్‌ కింగ్స్‌ ఇంప్రూవ్‌ అయింది. మూమెంట్స్‌ను అందిపుచ్చుకుంటోంది. పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. గబ్బర్‌కు గాయమైన సామ్‌ కరన్‌ బాగానే నడిపిస్తున్నాడు. పంజాబ్‌ తర్వాతి పోరులో లక్నోతో తలపడనుంది.


4 పాయింట్లతో 3 జట్లు


ఫామ్‌లోకి వచ్చిందనకున్న ముంబయి ఇండియన్స్‌కు మళ్లీ వరుసగా రెండు ఓటములు ఎదురయ్యాయి. దాంతో 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. 3 విజయాలే సాధించింది. బౌలింగ్‌లో క్వాలిటీ లేకపోవడం ఇబ్బంది పెడుతోంది. తర్వాతి మ్యాచులో రాజస్థాన్‌తో తలపడనుంది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌, దిల్లీ క్యాపిటల్స్‌ తలో రెండు విజయాలతో వరుసగా 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. అన్నీ నెగెటివ్‌ రన్‌రేట్‌తోనే ఉన్నాయి. ఈ జట్లు ప్లేఆఫ్ వెళ్లాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో విజయం అందుకోవాలి.