Rohit Sharma in IPL: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మనే. అతను ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి నేటికి 15 సంవత్సరాలు పూర్తి అయింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 2008లో ఇదే రోజున (ఏప్రిల్ 20వ తేదీ) IPL అరంగేట్రం చేసాడు. రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో సాధించిన కొన్ని ప్రత్యేక విజయాల గురించి ఈ సందర్భంగా తెలుసుకుందాం. IPLలో రోహిత్ శర్మ అరంగేట్రం అప్పటి డెక్కన్ ఛార్జర్స్ జట్టు నుంచి జరిగింది. తొలి ఐపీఎల్‌ నుంచి రోహిత్‌ శర్మ విజయాల మెట్లు ఎక్కడం ప్రారంభించాడు.


అయితే ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, రోహిత్ శర్మ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సున్నాకి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రియల్ ఫామ్ అంటే హిట్ ఫామ్‌ని ప్రపంచం మొత్తం చూడటం మొదలుపెట్టింది. రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ నిపుణుడు. రోహిత్ శర్మ గత కొన్నేళ్లుగా బౌలింగ్ చేయలేదు. కానీ రోహిత్ శర్మ కూడా ఐపీఎల్‌లో హ్యాట్రిక్ వికెట్ సాధించాడని చాలా తక్కువ మందికి తెలుసు. ఐపీఎల్ 2009 లీగ్ మ్యాచ్‌లో తను ప్రస్తుతం ఆడుతున్న ముంబై ఇండియన్స్‌పైనే రోహిత్ శర్మ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. రోహిత్ తన మూడు వరుస బంతుల్లో అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమిని వికెట్లను తీసి చరిత్ర సృష్టించాడు.


రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్ అద్భుతం
అదే సంవత్సరంలో రోహిత్ శర్మ జట్టు డెక్కన్ ఛార్జర్స్ కూడా IPL టైటిల్‌ను గెలుచుకుంది. రోహిత్ శర్మ IPL ట్రోఫీని సాధించడం అదే మొదటిసారి. ఐపీఎల్ 2013 సీజన్‌లో రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించారు. అతని కెప్టెన్సీలో, ముంబై IPL ట్రోఫీని మొదటిసారి గెలిచింది. కానీ రోహిత్‌కు మాత్రం అది రెండో ట్రోఫీ.


ఆ తర్వాత రోహిత్ శర్మ వెనుదిరిగి చూడలేదు. రోహిత్ శర్మ 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు. మొత్తం ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 232 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలోని 227 ఇన్నింగ్స్‌లలో రోహిత్ 30.22 సగటు, 130.03 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 6014 పరుగులు చేశాడు. ఈ సమయంలో, రోహిత్ 58 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో 6000 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.


ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న  రోహిత్ శర్మ ఈ లీగ్‌లో మరో  అరుదైన ఘనతను అందుకున్నాడు.  సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన  హిట్‌మ్యాన్.. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ క్లబ్‌లో  చేరిన నాలుగో బ్యాటర్‌గా గుర్తింపుపొందాడు.  


ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరులు
- విరాట్ కోహ్లీ - 228 మ్యాచ్‌లు 220 ఇన్నింగ్స్ - 6,844 పరుగులు 
- శిఖర్ ధావన్ - 210 మ్యాచ్‌లు 209 ఇన్నింగ్స్  - 6,477 పరుగులు 
- డేవిడ్ వార్నర్ - 167 మ్యాచ్‌లు 167 ఇన్నింగ్స్ - 6,109   పరుగులు 
- రోహిత్ శర్మ - 232 మ్యాచ్‌లు 227 ఇన్నింగ్స్ - 6,014 పరుగులు  
- ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న ఆటగాడు సురేశ్ రైనా. అతడు  205 మ్యాచ్‌లు ఆడి 200 ఇన్నింగ్స్‌లలో  5,528 రన్స్ చేశాడు.