IPL 2023, KKR vs DC: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతా బ్యాటర్లలో ఈ సీజన్ మొదటి మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ జేసన్ రాయ్ (43: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆండ్రీ రసెల్ (38 నాటౌట్: 31 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) చివరి వరకు పోరాడాడు. ఢిల్లీ విజయానికి 120 బంతుల్లో 128 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతా ఈ సీజన్‌లో కొత్త ఓపెనింగ్ ఓడిని ప్రయత్నించింది. జేసన్ రాయ్ (43: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), లిట్టన్ దాస్‌ (4: 4 బంతుల్లో, ఒక ఫోర్) ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా వచ్చారు. అయితే జేసన్ రాయ్ క్రీజులో నిలబడగా, లిట్టన్ దాస్ విఫలం అయ్యాడు. దీంతో 15 పరుగులకే కోల్‌కతా మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలారు.


వెంకటేష్ అయ్యర్ (0: 2 బంతుల్లో), నితీష్ రాణా (4: 7 బంతుల్లో, ఒక ఫోర్), మన్‌దీప్ సింగ్ (12: 11 బంతుల్లో, ఒక సిక్సర్), రింకూ సింగ్ (6: 8 బంతుల్లో, ఒక ఫోర్), సునీల్ నరైన్ (4: 6 బంతుల్లో, ఒక ఫోర్) ఇలా వరుసగా విఫలం అయ్యారు. పిచ్ నుంచి కూడా కోల్‌కతా బౌలర్లకు చక్కని సహకారం లభించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు పడుతూనే ఉన్నాయి. 15వ ఓవర్ వరకు పోరాడిన జేసన్ రాయ్‌ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ కూడా ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. కానీ చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టడంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. కోల్‌కతా బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోర్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. ముకేష్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.