IPL 2023, CSK vs SRH: 


'యే.. బిడ్డా ఇది నా అడ్డా' అన్నట్టుగా ఆడింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. చెపాక్‌ డెన్‌లో అమేజింగ్ విక్టరీ సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆ టీమ్‌ సెట్‌ చేసిన 135 రన్స్‌ టార్గెట్‌ను మరో 8 బంతులు మిగిలుండగానే ఛేజ్‌ చేసింది. ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే (77; 57 బంతుల్లో 12x4, 1x6) అజేయ హాఫ్‌ సెంచరీ బాదేశాడు. మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (35; 30 బంతుల్లో 2x4) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు సన్‌ రైజర్స్‌లో ఓపెనర్ అభిషేక్‌ శర్మ (34; 26 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. రాహుల్‌ త్రిపాఠి (21; 21 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించాడు.


ఓపెనర్లే లాగేశారు!


తక్కువ టార్గెట్టే ఉండటంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఎలాంటి ఒత్తిడీ కనిపించలేదు. సునాయాసంగా గెలుస్తామన్న ధీమాతో ఆడింది. ఓపెనర్లు డేవాన్‌ కాన్వే, రుతురాజ్‌ బ్లాస్టింగ్‌ ఓపెనింగ్‌ ఇచ్చారు. తొలి వికెట్‌కు 66 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఓవర్‌ నుంచే వీరిద్దరూ బాదుడు షురూ చేశారు. మార్కో ఎన్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో కాన్వే వరుసగా 4,4,6,4,4 బాదేసి మ్యాచ్‌ను సీఎస్కే వైపు లాగేశాడు. 10.6వ బంతికి సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ దొరికింది. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన బంతిని కాన్వే స్ట్రెయిట్‌గా ఆడాడు. ఆ బంతి ఉమ్రాన్‌ చేతికి తగిలి నాన్‌ స్ట్రైకర్‌ వికెట్లకు తగిలింది. రుతురాజ్‌  క్రీజు బయటే ఉండటంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అజింక్య రహానె (9) కాసేపే క్రీజులో ఉన్నాడు. మధ్యలో స్పిన్నర్లు పట్టు బిగించడంతో సీఎస్కే విజయ సమీకరణం 30 బంతుల్లో 24గా మారింది. అంబటి రాయుడు (9) ఔటౌనా కాన్వే.. ఆఖరి వరకు లాగకుండా చెన్నైకి విజయం అందించాడు.




మెరుపుల్లేని ఓపెనింగ్‌


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభమే లభించింది. అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్స్‌ (18) మధ్య అవగాహన లేకపోవడం చేటు చేసింది. స్ట్రైకర్‌ పిలిస్తే నాన్‌ స్ట్రైకర్‌ రాడు.. నాన్‌ స్ట్రైకర్‌ పరుగెత్తితే స్ట్రైకర్‌ వెనక్కి పంపిస్తాడు! ఆకాశ్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌ పాండే కట్టు దిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులేయడంతో పవర్‌ ప్లేలో ఆరెంజ్‌ ఆర్మీ వికెట్‌ నష్టానికి 45 పరుగులే చేసింది. బ్రూక్‌ను సీఎస్కే బౌలర్లు రూమ్‌ తీసుకొని ఆఫ్‌సైడ్‌ ఆడనివ్వలేదు. ఆకాశ్ వేసిన 4.2వ బంతికి అతడు స్లిప్‌లో గైక్వాడ్‌కు చిక్కాడు. దాంతో 35 (26 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.


పేకమేడలా మిడిలార్డర్‌


వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు అభిషేక్‌తో కలిసి 30 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 71 వద్ద అభిని జడ్డూ ఔట్‌ చేశాడు. షాట్లు ఆడేందుకు ట్రై చేసిన త్రిపాఠినీ జట్టు స్కోరు 84 వద్ద అతడే పెవిలియన్‌కు పంపించడంతో సన్‌రైజర్స్‌ కథ ఆల్మోస్ట్‌ ముగిసింది. స్పిన్నర్ల దెబ్బకు  కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్ (12), హెన్రిచ్‌ క్లాసెన్‌ (17), మయాంక్‌ అగర్వాల్‌ (2) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆఖర్లో మార్కో ఎన్‌సన్‌ (17; 22 బంతుల్లో), వాషింగ్టన్‌ సుందర్‌ (9) ఒకట్రెండు షాట్లు ఆడటంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 134/7కు పరిమితమైంది. ఆకాశ్ సింగ్‌, మహీశ్‌ తీక్షణ, పతిరన తలో వికెట్‌ పడగొట్టారు.