IPL 2023, CSK vs SRH: 


ఆరెంజ్‌ ఆర్మీ మళ్లీ బ్యాట్లెత్తేసింది! చెపాక్‌ మ్యాచులో ఘోరంగా విఫలమైంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌కు విలవిల్లాడింది. 20 ఓవర్లు ఆడి ప్రత్యర్థికి కేవలం 135 పరుగుల స్వల్ప టార్గెట్‌ ఇచ్చింది. ఫ్లాట్‌ వికెట్‌పై బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ధోనీ సేనపై ఈ టార్గెట్‌ను డిఫెండ్‌ చేయడం కష్టమే! సన్‌ రైజర్స్‌లో ఓపెనర్ అభిషేక్‌ శర్మ (34; 26 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్‌. రాహుల్‌ త్రిపాఠి (21; 21 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. రవీంద్ర జడేజా (3/22) సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.






బ్రూక్‌.. వీక్‌నెస్‌ పట్టేశారు!


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభమే లభించింది. అయితే ఓపెనర్లు అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్స్‌ (18) మధ్య అవగాహన లేకపోవడం చేటు చేసింది. స్ట్రైకర్‌ పిలిస్తే నాన్‌ స్ట్రైకర్‌ రాడు.. నాన్‌ స్ట్రైకర్‌ పరుగెత్తితే స్ట్రైకర్‌ వెనక్కి పంపిస్తాడు! ఆకాశ్‌ సింగ్‌, తుషార్‌ దేశ్‌ పాండే కట్టు దిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్తుల్లో బంతులేయడంతో పవర్‌ ప్లేలో ఆరెంజ్‌ ఆర్మీ వికెట్‌ నష్టానికి 45 పరుగులే చేసింది. బ్రూక్‌ను సీఎస్కే బౌలర్లు రూమ్‌ తీసుకొని ఆఫ్‌సైడ్‌ ఆడనివ్వలేదు. ఆకాశ్ వేసిన 4.2వ బంతికి అతడు స్లిప్‌లో గైక్వాడ్‌కు చిక్కాడు. దాంతో 35 (26 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.






మిడిలార్డర్‌ కొలాప్స్‌!


వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్‌ త్రిపాఠి కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. రెండో వికెట్‌కు అభిషేక్‌తో కలిసి 30 బంతుల్లో 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 71 వద్ద అభిని జడ్డూ ఔట్‌ చేశాడు. షాట్లు ఆడేందుకు ట్రై చేసిన త్రిపాఠినీ జట్టు స్కోరు 84 వద్ద అతడే పెవిలియన్‌కు పంపించడంతో సన్‌రైజర్స్‌ కథ ఆల్మోస్ట్‌ ముగిసింది. స్పిన్నర్ల దెబ్బకు  కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్ (12), హెన్రిచ్‌ క్లాసెన్‌ (17), మయాంక్‌ అగర్వాల్‌ (2) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆఖర్లో మార్కో ఎన్‌సన్‌ (17; 22 బంతుల్లో), వాషింగ్టన్‌ సుందర్‌ (9) ఒకట్రెండు షాట్లు ఆడటంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 134/7కు పరిమితమైంది. ఆకాశ్ సింగ్‌, మహీశ్‌ తీక్షణ, పతిరన తలో వికెట్‌ పడగొట్టారు.


చెన్నై సూపర్‌ కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే, అజింక్య రహానె, శివమ్‌ దూబె, మొయిన్‌ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మహీశ్‌ థీక్షణ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్‌, మతీశ పతిరణ


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: హ్యారీ బ్రూక్‌, మయాంక్‌ అగర్వాల్‌, రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, అభిషేక్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో ఎన్‌సన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మర్కండే, ఉమ్రాన్‌ మాలిక్‌