IPL 2023 Auction: ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలం ముగిసింది. తమకు కావలసిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 80 మందిని రూ. 167 కోట్లకు కొనుగోలు చేశాయి. అయితే వీరిలో ఎక్కువమంది యువ క్రికెటర్లు ఉండడం విశేషం.
భవిష్యత్ పై దృష్టి!
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజీలన్నీభవిష్యత్తుపై దృష్టి పెట్టిన్నట్లు తెలుస్తోంది. అందుకే అన్ని జట్లు యువ ఆటగాళ్ల కోసం ఎక్కువగా పోటీపడ్డాయి. అలానే వారికోసమే ఎక్కువ ఖర్చు చేశాయి. మొత్తం 80 మంది అమ్ముడవగా.. వారిలో యువ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 30 ఏళ్ల లోపు 55 మంది ఆటగాళ్లు ఉండగా.. 30 ఏళ్లు దాటినవారు 25 మంది. 25 ఏళ్లలోపు ఆటగాళ్లు 27 మంది ఉన్నారు. వారికోసం ఫ్రాంచైజీలు 71.10 కోట్లు ఖర్చు పెట్టాయి. అంటే ఒక్కో ఆటగాడికి సగటున 2.63 కోట్లు ఖర్చయ్యాయి.
25 నుంచి 29 ఏళ్లలోపు వారు 28 మంది ఉన్నారు. వీరిపై ఫ్రాంచైజీ యజమానులు 38.90 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఒక్కో ప్లేయర్ కు 1.39 కోట్లు పెట్టారు. 30 నుంచి 34 ఏళ్ల లోపు 20 మంది ఆటగాళ్లను 51.50 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే 35 దాటిన ఐదుగురు ఆటగాళ్లు 5.5 కోట్లకు అమ్ముడయ్యారు.
- మొత్తం అమ్ముడైన ఆటగాళ్లు- 80
- 25 ఏళ్లలోపు ఆటగాళ్లు- 27
- 25 నుంచి 29 ఏళ్ల లోపు ఆటగాళ్లు- 23
- 30 ఏళ్లు దాటినవారు- 25
- 35 ఏళ్లు దాటినవారు- 5 గురు
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రేటు పలికిన ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కరన్ వయసు 24 ఏళ్లు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ వయసు 23 సంవత్సరాలు. పంజాబ్ కింగ్స్ 18.5 కోట్ల రూపాయల బిడ్‌తో సామ్ కరన్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 17.5 కోట్లకు దక్కించుకుంది.