ఐపీఎల్‌లో తన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులకు పరిమితం అయింది. అభిషేక్ శర్మ (43: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్‌లకు చెరో మూడు వికెట్లు దక్కాయి.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ను ఎప్పటిలానే ఓపెనింగ్ సమస్య వెంటాడింది. కేన్ విలియమ్సన్ స్థానంలో ఓపెనింగ్ చేసిన ప్రియం గర్గ్ (4: 7 బంతుల్లో) విఫలం అయ్యాడు. అయితే రాహుల్ త్రిపాఠి (20: 18 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), అభిషేక్ శర్మ (43: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.


అయితే ఆ తర్వాత హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో వాషింగ్టన్ సుందర్ (25: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రొమారియో షెపర్డ్ (26: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. వీరు వేగంగా ఆడటంతో హైదరాబాద్ చివరి నాలుగు ఓవర్లలో 58 పరుగులు చేసింది. 20 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.