IPL 2022 Sourav Ganguly Said On Virat Kohli, Rohit Sharma Poor Form: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit sharma), మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly)  స్పందించారు. వారి ఆటతీరు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదన్నాడు. త్వరలోనే వారిద్దరూ పరుగులు చేయడం మొదలు పెడతారని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీల ప్రదర్శన ఆకట్టుకుందన్నారు.


'రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాళ్లు. వారు కచ్చితంగా తిరిగి ఫామ్‌లోకి వస్తారు. అందులో సందేహం లేదు. త్వరలోనే వారు పరుగులు చేస్తారని ఆశిస్తున్నా. విరాట్‌ కోహ్లీ మదిలో ఏముందో నాకైతే తెలియదు. కానీ అతడు తన ఫామ్‌ను తిరిగి తెచ్చుకుంటాడని నాకు నమ్మకం ఉంది. అతడో గ్రేట్‌ ప్లేయర్‌' అని గంగూలీ అన్నారు.


ఈ సీజన్లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వరుసగా విఫలం అవుతున్నారు.  ఇప్పటి వరకు కోహ్లీ 9 మ్యాచులాడి కేవలం 128 పరుగులు చేశాడు. సగటు 16గా ఉంది. ఇలాంటి పేలవ ఫామ్‌లో అతడిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. కొన్ని మ్యాచుల్లోనైతే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక రోహిత్‌ పరిస్థితీ అలాగే ఉంది. జట్టును గెలుపు బాట పట్టించలేకపోతున్నాడు. 8 మ్యాచుల్లో 19.13 సగటుతో 153 పరుగులే చేశాడు. వీరిద్దరూ ఈ సీజన్లో ఒక్క హాఫ్‌ సెంచరీ అయినా చేయకపోవడం గమనార్హం.


ఐపీఎల్‌ 2022ను క్రమం తప్పకుండా చూస్తున్నానని సౌరవ్‌ గంగూలీ అన్నాడు. కొత్త ఫ్రాంచైజీల ప్రదర్శన తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. 'ఐపీఎల్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. రోజూ ఐపీఎల్‌ మ్యాచులు చూస్తున్నాను. ఏ జట్టైనా సీజన్‌ గెలవగలదు. ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. కొత్త జట్లైనా గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ అదరగొడుతున్నాయి' అని దాదా ప్రశంసించారు.