IPL 2022, KKR vs RCB: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) బోణీ కొట్టింది. ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను (Kolkata Knightriders) 3 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (28; 40 బంతుల్లో 1x4, 1x6), షాబాజ్ అహ్మద్ (27; 20 బంతుల్లో 3x6) రాణించారు. అంతకు ముందు కేకేఆర్‌లో ఆండ్రీ రసెల్ (25; 18 బంతుల్లో 1x4, 3x6), ఉమేశ్ యాదవ్ (18; 12 బంతుల్లో 2x3, 1x6) టాప్ స్కోరర్లు.
ఆఖరి వరకు టెన్షన్!
మరోసారి ఉమేశ్ యాదవ్ (2/16) తనలోని ఫైర్ చూపించాడు. టిమ్ సౌథీ (3/20)తో కలిపి ఆర్‌సీబీ టాప్ ఆర్డర్‌ను వణికించేశాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ అనుజ్ రావత్ (0)ను ఔట్ చేశాడు. తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ (5)ను సౌథీ పెవిలియన్ పంపించాడు. 2.1వ బంతికి విరాట్ కోహ్లీ (12)ను ఉమేశ్ ఔట్ చేడయంతో ఆర్‌సీబీ 17కే 3 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో షెర్ఫాన్ రూథర్ ఫర్డ్, డేవిడ్ విలే (18) 45 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. జట్టు స్కోరు 62 వద్ద విలేను నరైన్ ఔట్ చేయడం ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన షాబాజ్ అహ్మద్ చక్కని సిక్సర్లు బాది రన్‌రేట్‌ను అదుపులోకి తీసుకొచ్చాడు. రూథర్‌ఫర్డ్‌తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యం అందించిన అతడిని 15.6 బంతికి చక్రవర్తి ఔట్ చేశాడు. జాక్సన్ వేగంగా స్టంపౌట్ చేశాడు. అప్పటికి స్కోరు 101/5. మరో 6 పరుగులకే రూథర్‌ఫర్డ్ ఔటవ్వడంతో టెన్షన్ పెరిగింది. కానీ హర్షల్ పటేల్ (10)తో కలిసి దినేశ్ కార్తీక్ (14) విన్నింగ్ అందించాడు.
వెనకొచ్చేవాళ్లు కొడతారని!
పిచ్ బౌలర్లకు అనుకూలించినా మొదట కోల్‌కతా (Kolkata Knightriders) బ్యాటింగ్ చేసిన తీరు నిరాశపరిచింది! తొలి 3 ఓవర్లకు పరుగులేమీ రాకపోవడంతో ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (10), అజింక్య రహానె (9) ఒత్తిడిగా ఫీలయ్యారు. భారీ షాట్లకు ప్రయత్నించి వెంటవెంటనే ఔటయ్యారు. ఒకటి రెండు షాట్లు ఆడిన నితీశ్ రాణా (10) సైతం షార్ట్‌పిచ్ డెలివరీకి పెవిలియన్ చేరిపోయాడు. అప్పటికి స్కోరు 44. అప్పుడైనా బ్యాటర్లు నిలకడగా ఆడొచ్చు కదా! వెనక హిట్టర్లు ఉన్నారని షాట్లకు పోయారు. దాంతో మరో 2 పరుగులకే శ్రేయస్ (13)ను హసరంగ ఔట్ చేశాడు.
కాసేపు సునిల్ నరైన్ (12), సామ్ బిల్లింగ్స్ (14) కలిసి 21 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 67 వద్ద నరైన్, జాక్సన్ (0)ను హసరంగ పెవిలియన్ పంపించాడు. బిల్లింగ్స్‌తో కలిసి 3 సిక్సర్లు బాదేసిన రసెల్ (25)ను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో కోల్‌కతా 99/8తో నిలిచింది. అప్పటికి ఇంకా 6 ఓవర్లు మిగిలున్నాయి. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (18), వరుణ్ చక్రవర్తి (10 నాటౌట్) 27 పరుగుల భాగస్వామ్యంతో గౌరవప్రదమైన 128 స్కోర్ అందించారు. హసరంగ 4, అక్షదీప్ 3, హర్షల్ 2 వికెట్లు తీశారు.