ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (54: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 153 పరుగులు కావాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు వారు ఆశించిన ఆరంభం లభించలేదు. దేవ్‌దత్ పడిక్కల్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆ తర్వాత ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (22: 25 బంతుల్లో, మూడు ఫోర్లు), కెప్టెన్ సంజు శామ్సన్ ఇన్నింగ్స్‌ను మెల్లగా ముందుకు తీసుకెళ్లారు. వీళ్లిద్దరూ వేగంగా ఆడలేకపోవడం స్కోరు నిదానంగా కదిలింది. రెండో వికెట్‌కు వీరిద్దరూ 48 పరుగులు జోడించాక జోస్ బట్లర్ అవుటయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (13: 13 బంతుల్లో, ఒక ఫోర్), రియాన్ పరాగ్ (19: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. చివర్లో  షిమ్రన్ హెట్‌మేయర్ (27 నాటౌట్: 13 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) వేగంగా ఆడినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీయగా... శివం మావి, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.