PBKS vs RR, 1 Innings Highlights: ఐపీఎల్ 2022లో 52వ మ్యాచులో పంజాబ్ కింగ్స్ చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు 190 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ప్రత్యర్థి బౌలర్లు వైవిధ్యమైన బంతులు వేస్తున్నా పంజాబ్ బ్యాటర్లు రాణించారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో (56; 40 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భానుక రాజపక్స (27; 18 బంతుల్లో 2x4, 2x6), జితేశ్ శర్మ (38*; 18 బంతుల్లో 4x4, 2x6) మెరుపు షాట్లు ఆడారు. యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీశాడు.
ఈ సారి జానీ, జిత్తు
మధ్యాహ్నం మ్యాచు కావడం, తొలుత బ్యాటింగ్ చేస్తున్న జట్లు గెలుస్తుండటంతో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం దొరికింది. శిఖర్ ధావన్ (12; 17 బంతుల్లో) త్వరగా పెవిలియన్ చేరుకున్నా జానీ బెయిర్ స్టో మాత్రం దంచికొట్టాడు. మొదట్లో కొన్ని ఇన్‌సైడ్ ఎడ్జ్ అయినప్పటికీ అలవాటు పడ్డాక చక్కని షాట్లు ఆడాడు. మరోవైపు భానుక రాజపక్స సైతం భారీ సిక్సర్లు, బౌండరీలు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. జట్టు స్కోరు 89 వద్ద రాజపక్సను చాహల్ బౌల్డ్ చేశాడు. బెయిర్ స్టో 34 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. అయితే పరుగు వ్యవధిలోనే మయాంక్ అగర్వాల్ (15), జానీని చాహలే పెవిలియన్ పంపించాడు. ఆఖర్లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టన్ (22; 14 బంతుల్లో 1x3, 2x6) మెరుపు షాట్లు ఆడటంతో స్కోరు 189/5కు చేరుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ, అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది.