IPL 2022, PBKS vs RR: ఐపీఎల్‌ 2022లో 52వ మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియం (Wankhede Stadium) ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌ రెండు జట్లకు అత్యంత కీలకం. ప్లేఆఫ్స్‌ రేసులో ముందుండాలంటే తప్పకుండా గెలవాలి. మరి వీరిలో ఎవరిది పై చేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?


రాజస్థాన్‌దే పైచేయి


ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆఖరి దశకు చేరుకుంటోంది. ప్లేఆఫ్స్‌ చేరుకోవాలంటే రాజస్థాన్‌, పంజాబ్‌కు ప్రతి మ్యాచ్‌ ఇంపార్టెంటే! అందుకే ఈ మ్యాచ్‌ గెలిస్తే మున్ముందు ప్రెజర్‌ నుంచి తప్పించుకోవచ్చు. బలంగా కనిపిస్తున్న సంజూ సేన 10 మ్యాచులాడి 6 గెలిచి 12 పాయింట్లో మూడో స్థానంలో ఉంది. రనరేటూ పాజిటివ్‌గానే ఉంది. ఇకపై జరిగే నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు గెలిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయి.  పంజాబ్‌ 10 మ్యాచుల్లో 5 గెలిచి 7వ స్థానంలో ఉంది. నెగెటివ్‌ రన్‌రేట్‌తో ఉంది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌ చావో రేవో అన్నట్టుగానే ఆడాలి. ఈ రెండు జట్టు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 14-9తో రాజస్థాన్‌దే పైచేయి.


బట్లర్‌ కొట్టేస్తాడా


ఐపీఎల్‌లో ఒక సీజన్లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్‌ కోహ్లీ (973) పేరుతో ఉంది. ఆ రికార్డుకు జోస్‌ బట్లర్‌ 385 రన్స్‌ దూరంలో ఉన్నాడు. అతడు సూపర్‌ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇంకో ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ ప్రెజర్‌ ఫీలవుతున్నాడు. మెరుగైన ఆరంభాలు అందించడం లేదు. కొన్ని మ్యాచుల నుంచి కెప్టెన్‌ సంజూ శాంసన్‌పై పరుగుల భారం పడుతోంది. మంచి ఓపెనింగ్‌ వస్తే అతడా స్కోరును వేరే లెవల్‌కు తీసుకుపోగలడు. హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, అశ్విన్‌ ఫర్వాలేదు. నాలుగో స్థానంలో వచ్చేవారు రాణించాల్సిన అవసరం ఉంది. ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్‌దీప్‌ సేన్‌తో కూడిన పేస్‌ దళం, యూజీ, యాష్‌తో కూడిన స్పిన్‌ విభాగం బలంగా ఉంది. యూజీ వికెట్లు తీస్తే రాజస్థాన్‌ గెలవడం సులభం.


వేధిస్తున్న మయాంక్‌ ఫామ్‌


పంజాబ్‌ కింగ్స్‌ ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో 2 గెలిచింది. చివరి మ్యాచులో గుజరాత్‌పై గెలవడం ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ విలువైన ఓపెనింగ్‌ ఇస్తున్నాడు. జానీ బెయిర్‌స్టో కోసం మయాంక్‌ తన ప్లేస్‌ను త్యాగం చేశాడు. మిడిలార్డర్లో అతడు రాణిస్తే జట్టుకు తిరుగుండదు. తన జోన్‌లో ఉంటే లియామ్‌ లివింగ్‌స్టన్‌ను ఎవరూ ఆపలేరు. రాజపక్స, జితేశ్ మంచి టచ్‌లో ఉన్నారు. సమన్వయం, నిలకడ లోపమే పంజాబ్‌ను ఓడిస్తోంది. పంజాబ్ బౌలింగ్‌ మాత్రం బాగుంది. రబాడా, అర్షదీప్‌, రిషి ధావన్‌, సందీప్‌ పేస్‌ విభాగం చూస్తున్నారు. రాహుల్‌ చాహర్‌, లివింగ్‌ స్టోన్‌ స్పిన్‌ వేస్తున్నారు. ఎవరో ఒకరు యాంకర్‌ ఇన్నింగ్స్‌ ఆడితే బాగుంటుంది.


PBKS vs RR Probable XI


పంజాబ్‌ కింగ్స్‌: జానీ బెయిర్‌ స్టో, శిఖర్‌ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, భానుక రాజపక్స, లియామ్‌ లివింగ్‌స్టన్‌, జితేశ్ శర్మ, రిషి ధావన్‌, రాహుల్‌ చాహర్‌, కాగిసో రబాడా, అర్షదీప్‌ సింగ్‌, సందీప్ శర్మ


రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజూ శాంసన్‌, కరుణ్‌ నాయర్‌ / యశస్వీ జైశ్వాల్‌, రియాన్‌ పరాగ్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ సేన్‌