ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు కావాల్సిన దశలో డేనియల్ శామ్స్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ముంబై ఐదు పరుగులతో విజయం సాధించింది.


మెరుపు ఆరంభం లభించినా...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభం అందించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (45: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (43: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు కేవలం 7.3 ఓవర్లలోనే 74 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో టిమ్ డేవిడ్ (44 నాటౌట్: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మినహా ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. తిలక్ వర్మ (21: 16 బంతుల్లో, రెండు ఫోర్లు)... టిమ్ డేవిడ్‌కు కాసేపు సహకారం అందించాడు.


ఆఖర్లో టిమ్ డేవిడ్ సిక్సర్లతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగలిగింది. చివరి ఐదు ఓవర్లలో ముంబై ఇండియన్స్ ఏకంగా 57 పరుగులు సాధించడం విశేషం. ఓపెనర్లు మెరుపు ఆరంభం అందించాక ముంబై సులభంగా 200 స్కోరును అందుకునేలా కనిపించింది. అయితే సూర్య కుమార్ యాదవ్ (13: 11 బంతుల్లో, ఒక సిక్సర్), కీరన్ పొలార్డ్ (4: 14 బంతుల్లో), డేనియల్ శామ్స్ (0: 2 బంతుల్లో) విఫలం కావడంతో ముంబై ఇండియన్స్ ఆ స్కోరును సాధించలేకపోయింది.


గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ రాణించాడు. నాలుగు ఓవర్లలో కోటాలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్‌లకు తలో వికెట్ దక్కింది.


ముంబై ఇన్నింగ్స్‌కు రీప్లేలా...
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఇన్నింగ్స్... ముంబై ఆటకు రీప్లేలా సాగింది. వీరి కూడా అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (55: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (52: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 73 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు. వీరిద్దరూ మొదటి నుంచి వేగంగా ఆడుతూ ముంబైకి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. అయితే స్పిన్నర్ మురుగన్ అశ్విన్ వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి గుజరాత్‌ను ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టాడు.


టూ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (14: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) పొలార్డ్ బౌలింగ్‌లో ఊహించని రీతిలో హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. ఆ తర్వాత లేని పరుగుకు ప్రయత్నించి హార్దిప్ పాండ్యా (24: 14 బంతుల్లో, నాలుగు ఫోర్లు) పెవిలియన్ బాట పట్టాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. డేనియల్ శామ్స్ చివరి ఓవర్లో  తొమ్మిది పరుగులు రావాల్సిన దశలో మొదటి మూడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో పాటు రాహుల్ తెవాటియా (3: 4 బంతుల్లో) రనౌటయ్యాడు. చివరి మూడు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే రావడంతో ముంబై ఐదు పరుగులతో విజయం సాధించింది. రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ లాంటి బ్యాటర్లకు డేనియల్ శామ్స్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.