Suresh Raina - CSK:సురేశ్ రైనాను తీసుకోని చెన్నై సూపర్ కింగ్స్‌పై ఇంకా అభిమానులు ఆగ్రహంతోనే ఉన్నారు! సోషల్ మీడియాలో అతడి పోస్టులు కనిపించగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చిన్న తలా సురేశ్ రైనాను సీఎస్‌కే వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు. యుక్త వయసులో అతడి సేవలను వాడుకొని వయసు పెరిగాక కనీసం గౌరవించట్లేదని మండిపడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో సురేశ్ రైనా వేలానికి వచ్చాడు. అతడి పేరు రాగానే ఫ్రాంచైజీలు ఎలాంటి ఆసక్తి చూపించలేదు. ఇన్నాళ్లూ అతడి సేవలు ఉపయోగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సైతం మొహం చాటేసింది. అవమాన భారాన్ని తట్టుకోలేక రెండోసారి అతడు తన పేరును వేలం నుంచి తొలగించుకున్నాడు.
చెన్నై సూపర్‌కింగ్స్ వేలంలో తిరిగి తన కోర్ టీమ్‌ను దాదాపుగా దక్కించుకుంది. అంబటి రాయుడు, దీపక్ చాహర్, రాబిన్ ఉతప్పను తీసుకుంది. సురేశ్ రైనాను మాత్రం తీసుకోలేదు. 2016, 2017లో సీఎస్‌కేపై నిషేధం ఉన్నప్పుడు అతడు గుజరాత్ లయన్స్‌కు సారథ్యం వహించాడు. అప్పుడు తప్ప మరెప్పుడూ అతడు మరో ఫ్రాంచైజీ వైపు చూడలేదు. 2008 నుంచి దానికే ఆడాడు. ఒకానొక దశలో అత్యధిక పరుగులతో 'మిస్టర్ ఐపీఎల్'గా పేరు పొందాడు. 2020లో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దుబాయ్ నుంచి రైనా తిరిగొచ్చేశాడు. దాంతో అతడిపై ఫ్రాంచైజీ యాజమాన్యం తీవ్ర విమర్శలు చేసింది.
సురేశ్ రైనాకు కృతజ్ఞతలు చెబుతూ చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో ఫేర్‌వెల్ పోస్టు పెట్టింది. వీడియోను చూసిన వెంటనే అభిమానులు ఫైర్ అయ్యారు. 'యుక్త వయసులో రైనాను ఉపయోగించుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు' అని సీఎస్‌కేను ఒకరు విమర్శించారు. 'ఇలాంటి పైపై మమకారం మాకొద్దు' అని మరొకరు అన్నారు. 'రైనాతో ఎలాంటి సమస్య లేకుంటే వేలంలో ఎందుకు గౌరవించలేదు' అని ఇంకొకరు అన్నారు.