Mumbai Indians Captain Rohit Sharma fined Rs 12 lakh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)ను మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇషాన్‌ కిషన్‌ (81), రోహిత్‌ శర్మ (41) రాణించడంతో 177 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. లలిత్‌ యాదవ్‌ (48; 38 బంతుల్లో 4x4, 2x6), అక్షర్‌ పటేల్‌ (38; 17 బంతుల్లో 2x3, 3x6) కీలక సమయంలో రాణించి ఢిల్లీకి విజయాన్ని అందించారు.


రోహిత్ శర్మకు జరిమానా.. 
సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌‌లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోగా.. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మక్ ఐపీఎల్ పాలక మండలి షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీలో మ్యాచ్‌లో ఫీల్డింగ్ పదే పదే మార్పులు చేస్తూ నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోవడంతో 5 సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ పాలక మండలి జరిమానా విధించింది. ఆదివారం ముంబైలోని బ్రబౌర్న్ వేదికగా ముంబై, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. కీలక సమయంలో రాణించిన ఢిల్లీ విజయంతో సీజన్ ప్రారంభించింది. 


ఐపీఎల్ 2022లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ నియమావళి ప్రకారం ఇది తొలి తప్పిదం కాగా, ఇందుకు ముంబై కెప్టెన్ రోహిత్ రూ.12 లక్షల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఐపీఎల్ పాలక మండలి ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఐపీఎల్‌లో మరోసారి తొలి మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. గత కొన్ని సీజన్లు ఇదే తంతు కొనసాగుతోంది.


పేలిన డైనమైట్‌.. 
ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) కు ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan kishan), రోహిత్‌ శర్మ (Rohit sharma) తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం అందించారు.  8.2వ ఓవర్లో కుల్‌దీప్‌ (Kuldeep yadav) హిట్‌మ్యాన్‌ను ఔట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన అన్‌మోల్‌ ప్రీత్ సింగ్‌ (8)నీ అతడే పెవిలియన్‌ పంపించాడు. హైదరాబాదీ తిలక్‌ వర్మ (22; 15 బంతుల్లో 3x4)తో కలిసి కిషన్‌ దుమ్మురేపాడు. 34 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. చక్కని షాట్లతో ఆకట్టుకున్న తిలక్‌ను ఖలీల్‌ అహ్మద్‌ ఔట్‌ చేశాడు. పొలార్డ్‌ (3)ను కుల్‌దీప్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (12), డేనియెల్‌ సామ్స్‌ (7*)తో కలిసి ఇషాన్‌ సిక్సర్లు, బౌండరీలు బాది ముంబయి స్కోరును  177-5కు చేర్చాడు.


ఢిల్లీ సూపర్ ఛేజింగ్..
టిమ్‌ సీఫెర్ట్‌ (21; 14 బంతుల్లో 4x4), పృథ్వీ షా (38) బౌండరీలు కొట్టడంతో 3 ఓవర్లకే ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 30 దాటేసింది.  మురుగన్‌ అశ్విన్‌కు ఒకే ఓవర్లో సీఫెర్ట్‌, మన్‌దీప్‌ (0)ను ఔట్‌ చేశాడు. తర్వాత తైమల్‌ మిల్స్‌ ఓవర్లో  రిషభ్‌ పంత్‌ (1) పెవిలియన్‌ చేరాడు. లలిత్‌ యాదవ్‌ (48), అక్షర్‌ పటేల్‌ (38) రాణించగా, శార్ధూల్ ఠాకూర్ 11 బంతుల్లో 22 పరుగులతో మెరుపులు మెరిపించాడు. 18.2 ఓవర్లలోనే 178 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్.


Also Read: PBKS Vs RCB: కెప్టెన్ మారినా కలిసిరాలేదు - పంజాబ్‌పై ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి!


Also Read: Tilak Varma in IPL: అసలెవరీ తిలక్ వర్మ - ముంబై తరఫున అరంగేట్రం - మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు!