MS Dhonis Retirement From IPL: ఈ సీజన్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) నుంచి సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్సీ నుంచి వైదొలగడమే అందుకు కారణమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎస్కే సారథ్య బాధ్యతలు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించారు. ఈ ఏడాది ధోనీ సలహాలు, సూచనలతో జడేజా సీఎస్కే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. నేడు ఐపీఎల్ 2022 ప్రారంభం కానుంది.
కెప్టెన్లుగా ధోనీ, కోహ్లీ లేకుండా..
కెప్టెన్‌గా ధోనీ లేకుండా Chennai Super Kings ఎలా ఉంటుందోనని, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ లేకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) ఇకపై ఎలా ఉండనుందని క్రికెట్ ప్రేమికులు, ధోనీ, కోహ్లీ ఫ్యాన్స్ కాస్త ఆలోచనలో పడ్డారు. ఈ అంశంపై క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ (1983 World Cup-winning captain Kapil Dev) కపిల్ దేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ABP ఐడియాస్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ధోనీ ఆటలోకి రాకముందు క్రికెట్ ఉందని, ధోనీ రిటైర్మెంట్ తరువాత కూడా క్రికెట్ ఉంటుందని గుర్తుంచుకోవాలని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు.
యువతకు కపిల్ దేవ్ కీలక సూచనలు
దేశంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన కపిల్ దేవ్ యువతకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి ఐకాన్ ఉండాలని, తద్వారా వారిని చూసి ఎంతో నేర్చుకుంటూ జీవితంలో విజయాలు సాధించాలన్నారు. తాము ఆడే సమయంలో సునీల్ గవాస్కర్ తమకు ఐకాన్ అని, ఆ తరువాత కాలంలో సచిన్ టెండూల్కర్, అనంతరం ఎంఎస్ ధోనీ, ఇటీవల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఐకాన్లుగా మారారు. ఈరోజు యువకులను చూస్తే, వారు జావెలిన్ త్రో చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో దేశానికి స్వర్ణం రావడంతో క్రేజ్ పెరిగిందన్నారు.
క్రికెట్ ఎప్పటికీ ఉంటుంది..
ధోనీ లేని ఐపీఎల్ ను ఎలా చూస్తారు, సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ కాకుండా వేరు ఆటగాడైతే ఎలా భావిస్తారన్న ప్రశ్నకు మాజీ ఛాంపియన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోనీ రాకుముందు క్రికెట్ ఉంది, ధోనీ తర్వాత క్రికెట్ ఉంటుంది. అయితే ధోనీ తరువాత మరో ఆటగాడు యువతకు ఐకాన్‌గా మారతాడు. యువతరం ఈ విషయాన్ని గ్రహించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గతంలోలాగ ధోనీ బ్యాటింగ్ చేయలేడని, అతడిపై అంచనాలు తగ్గించుకోవాలని గత ఏడాది సైతం కపిల్ మాజీ కెప్టెన్ ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ధోనీ కెప్టెన్సీతో క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయని, గతంలో చేసిన ప్రదర్శనలో సగం మాత్రమే చేయగలడని ధోనీ ఆటపై కపిల్ గత ఏడాది ఇలా స్పందించారు.
ధోనీ రికార్డులు..
IPL 2022 పూర్తయ్యాక ఎంఎస్ ధోనీ ఈ లీగ్ నుంచి సైతం వైదొలిగి, క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యే అవకాశం ఉందని, అందుకే సీఎస్కే కెప్టెన్సీని జడేజాకు అప్పగించారని చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో ధోనీ ఒకరు. టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ధోనీ. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగు పర్యాయాలు ఛాంపియన్‌గా నిలిపాడు. ధోనీ సారథ్యంలో సీఎస్కే 204 మ్యాచ్‌లలో 121 విజయాలు సాధించింది.
Also Read: IPL 2022, CSK vs KKR: ముంబయి శ్రేయస్ అడ్డా, జడ్డూ సౌరాష్ట్ర బిడ్డ - ఫస్ట్ మ్యాచ్‌లో గెలుపెవరిది?
Also Read: ఎర్రమట్టి వికెట్లపై గెలిపించేది పేసర్లా? స్పిన్నర్లా? ఏ జట్టుకు బెస్ట్!!