Du Plessis on Dhoni: గతంలో తాను ఇతరులపై ప్రభావం చూపించే నాయకులు వద్ద ఆడానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ (Faf du plessis) అన్నాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో ఆడటం మాత్రం ఎంతో లక్కీగా వర్ణించాడు. అతడి తెలివితేటలను దగ్గరుంచి పరిశీలించానని వెల్లడించాడు. అయినప్పటికీ తన సొంత శైలిలోనే కెప్టెన్సీ చేస్తానని అంటున్నాడు.
ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) దిగిపోవడంతో డుప్లెసిస్‌ను ఆ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ప్రకటించింది. వేలంలో అతడిని రూ.7 కోట్లకు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాకు గతంలో సారథ్యం వహించడం, మెరుగ్గు ఆడుతుండటం, అనుభవశాలి కావడంతో అతడికి నాయకత్వం అప్పగించారు. శుక్రవారం డుప్లెసిస్ మాట్లాడుతూ ఎంఎస్ ధోనీ సారథ్యంలో ఆడటం అదృష్టమని వెల్లడించాడు.
'నేను చాలామంది మంచి కెప్టెన్ల వద్ద ఆడాను. అందులో గ్రేమ్‌స్మిత్ ఒకరు. నాయకుడిగా అతడిలో గొప్ప లక్షణాలు ఉండేవి. ఆ తర్వాత నేను చెన్నై సూపర్‌కింగ్స్‌కు వచ్చాను. సుదీర్ఘ కాలం ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఆడటం ఎంతో అదృష్టం. అతడితో సన్నిహితంగా మెలిగాను. అతడి తెలివితేటలను దగ్గరుండి గమనించాను. పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఎలా తీసుకుంటాడో చూశాను. స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) సైతం గొప్ప సారథి. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు. ఇప్పుడు కోచ్‌గా పేరు తెచ్చుకున్నాడు' అని డుప్లెసిస్ అన్నాడు.
ఆర్‌సీబీలో తనకు అండగా నిలిచే నాయకత్వ బృందం ఉందని డుప్లెసిస్ తెలిపాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ప్రతి కెప్టెన్‌కు తనదైన బలాబలాలు ఉంటాయి. చాలాకాలం మంచి కెప్టెన్ల వద్ద ఆడి వారి బలాలేంటో తెలుసుకున్నాను. అలాగే నా సొంత శైలి తెలుసుకున్నా. ఎవరైనా సరే తమ సొంతశైలిలోనే నాయకత్వం వహించడం అవసరం. బెంగళూరులోనూ చక్కని నాయకత్వ బృందం ఉంది. విరాట్ ఎంతో కాలం దేశానికి కెప్టెన్సీ చేశాడు. ఆర్‌సీబీకీ (RCB) అదరగొట్టాడు. అతడి దార్శనికత, పరిజ్ఞానం ఎంతో గొప్పది. ఇంకా గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) ఉన్నాడు. టీ20 మ్యాచుల్లో జట్టును నడిపించాడు. దినేశ్ కార్తీక్ చాలా జట్లకు కెప్టెన్సీ చేశాడు. వారిచ్చే సమాచారం నాకెంతో ఉపయోగపడుతుంది' అని డుప్లెసిస్ వివరించాడు.
'డుప్లెసిస్ చేరికతో బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసలైన బలం పెరిగింది. అతనిప్పటికే నిరూపించుకున్నాడు. ప్రతి సీజన్లో రాణిస్తాడు. అత్యుత్తమ, అత్యున్నత స్థాయిల్లో క్రికెట్ ఆడాడు' అని సంజయ్ బంగర్ అన్నాడు. 'మా టాప్ ఆర్డర్‌ను మరింత దృఢంగా మార్చే క్రికెటర్ల కోసం చూస్తున్నాం. డుప్లెసిస్ చేరికతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. అతడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు ఆడాడు. అతడి ఓపెనింగ్ మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలు ఆర్‌సీబీకి ఎంతో ముఖ్యం' అని RCB కోచ్ బంగర్ వెల్లడించాడు.