పంజాబ్ కింగ్స్‌తో మ్యాచుకు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్! ఆ ఫ్రాంచైజీ సభ్యుల్లో కొందరికి ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి పుణెకు కారులో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ చోటు చేసుకుంది.
పుణెలోని ఎంసీఏ వేదికగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచుకోసం లక్నో ఫ్రాంచైజీ సీఈవో రఘు అయ్యర్, గౌతమ్ గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా, రచితా బెర్రీ కలిసి ఒకే కారులో ముంబయి నుంచి పుణెకు బయల్దేరారు. మార్గమధ్యంలో వారి కారుకు యాక్సిడెంట్ జరిగింది. అదృష్టవశాత్తు వారిందరూ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
లక్కీగా గౌతమ్ గంభీర్ ఈ కారులో ప్రయాణించకపోవడం గమనార్హం. జట్టుతో పాటే అతడూ టీమ్ బస్సులోనే పుణెకు వెళ్లాడు. 'లక్నో సూపర్ జెయింట్స్ సీఈవో రఘు అయ్యర్, ఆయన అసోసియేట్ రచిత బెర్రీ, గౌతమ్ గంభీర్ మేనేజర్ గౌరవ్ అరోరా కలిసి కారులో పుణెకు బయల్దేరారు. మార్గమధ్యంలో వారి కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ముగ్గురూ సురక్షితంగా ఉన్నారు' అని ఎల్‌ఎస్‌జీ ట్వీట్ చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లోని 42వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పుణెలోని ఎంసీఏ క్రికెట్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతంలో పంజాబ్‌కు నాయకత్వం వహించాడు. అతడి మిత్రుడైన మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఇప్పుడు పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటున్నాడు.
లక్నోనే ముందంజలో
లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచుల్లో 5 విజయాలు సాధించింది. హార్డ్ హిట్టర్లనే కొనుగోలు చేసిన పంజాబ్ మాత్రం ఆశించన రీతిలో రాణించడం లేదు. 8 మ్యాచుల్లో 4 గెలిచి మిగతా 4 ఓడింది. నెగెటివ్ రన్‌రేట్ కారణంగా ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి. రాహుల్ తన పాత జట్టుతో తలపడటం, ప్రత్యర్థి కెప్టెన్ మిత్రుడే కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.