IPL 2022: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow supergiants) మొదటి మ్యాచ్‌ గెలిచింది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను (Chennai Superkings) 6 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్‌ ముగిశాక లక్నో మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir), సీఎస్‌కే మాజీ సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అందరికీ సర్‌ప్రైజింగ్‌గా మారింది. పైగా మహీని గౌతీ పొగిడిన తీరు సంతోషపరిచింది. అంతేకాదండోయ్‌.. కెప్టెన్‌ అంటూ పిలవడం బాగుంది.


టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ది విచిత్రమైన మనస్తత్వం! అంశాల వారీగా ఎవరినైనా విమర్శిస్తాడు. చిన్నా, పెద్దా అని చూడడు. స్వయంగా తన కెప్టెనైనా సరే కచ్చితంగా అడిగేస్తాడు. పైగా ఎప్పుడూ నవ్వడు. సీరియస్‌గా ఉంటాడు. తాను ఎక్కువగా నవ్వనని గతంలో చాలాసార్లు చెప్పాడు. క్రికెట్‌ ఆడేటప్పుడు గౌతీ కొందరు సీనియర్లతో సీరియస్‌గా ప్రవర్తించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎంఎస్ ధోనీ, విరాట్‌ కోహ్లీతో నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా మాట్లాడేవాడు. పోటీపడేవాడు.




సీఎస్‌కే మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీతో గంభీర్‌ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఆటగాళ్లు, ఇతర అంశాల గురించి చర్చించాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ధోనీతో కలిసిన చిత్రాన్ని పోస్టు చేశాడు. 'కెప్టెన్‌ను కలవడం చాలా బాగుంది' అని కామెంట్‌ పెట్టాడు. 2011, 2007లో ఎంఎస్‌ ధోనీ సారథ్యంలో సాధించిన ప్రపంచకప్పుల్లో గంభీర్‌  కీలక పాత్ర పోషించాడు. అతడి కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచులు ఆడాడు. ఇప్పుడు సీఎస్‌కే సారథి కానప్పటికీ మహీని 'కెప్టెన్‌' అంటూ పిలవడం చాలామందికి నచ్చింది. ఇక మ్యాచ్‌ ముగిశాక ఆనందంలో అతడిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానుల ప్రశంసలు లభించాయి!