Sunil Narine completes 1000 runs in the IPL: కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో వెయ్యి పరుగుల మార్క్ చేరుకున్నాడు. అయితే లీగ్ చరిత్రలో 1000 పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు. ఓవరా‌ల్‌గా లీగ్ చరిత్రలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో ఆటగాడు అయ్యాడు. గతంలో డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా ఈ ఫీట్ సాధించారు.


లక్నోతో మ్యాచ్‌లో అరుదైన ఘనత.. 
లక్నో సూపర్ జెయింగ్స్‌తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో నరైన్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 1000 రన్స్, 100 వికెట్లు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు నరైన్. మరోవైపు వరుసగా మూడు సీజన్లలో 20కి పైగా వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ నరైన్. ఈ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాడు గతంలో 2012, 2013, 2014 సీజన్లలో 20కి పైగా వికెట్లు పడగొట్టాడు. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014 సీజన్లలో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో సునీల్ నరైన్ కీలకపాత్ర పోషించాడు.






కేకేఆర్‌కు ఘోర పరాభవం.. 
ఐపీఎల్‌ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ విజయం లభించింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో లక్నో ఒక్కసారిగా టేబుల్ టాప్‌కు చేరుకుంది.


సునీల్ నరైన్ ఐపీఎల్ కెరీర్.. 
ఐపీఎల్‌లో 145 మ్యాచ్‌లాడిన సునీల్ నరైన్ 1003 పరుగులు చేయడంతో పాటు24.75 సగటుతో 151 వికెట్లు సాధించాడు. అయితే ఐపీఎల్ 2022లో మాత్రం నరైన్ ఆశించిన మేర రాణించకపోవడం కేకేఆర్ విజయావకాశాలను దెబ్బతిస్తోంది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లలో నరైన్ 8 వికెట్లు తీయగా.. బ్యాట్‌తో కేవలం 49 పరుగులు చేశాడు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చేసిన 22 పరుగులే ఈ సీజన్‌లో నరైన అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఓపెనర్‌గా దిగి పరుగులు రాబట్టగల నరైన్‌ను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు పంపడంతో ప్రభావం చూపలేకపోతున్నాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ ఈ సీజన్‌లో నరైన్‌ను రూ.6 కోట్లకు దక్కించుకుంది. 


Also Read: LSG Vs KKR: కోల్‌కతాను కుప్పకూల్చిన లక్నో - ఏకంగా 75 పరుగులతో విజయం - టేబుల్ టాప్‌లో సూపర్ జెయింట్స్!


Also Read: GT Vs MI Result: ఇది కదా మ్యాచ్ విన్నర్ల ముంబై - ఓటమి అంచుల్లోంచి గెలుపు తలుపుల వైపు - గుజరాత్‌కు షాకింగ్ ఓటమి!