ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ విజయం లభించింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో లక్నో ఒక్కసారిగా టేబుల్ టాప్‌కు చేరుకుంది.


వేగంగా మొదలెట్టినా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు మొదట్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ (0: 0 బంతుల్లో) అవుటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన క్వింటన్ డికాక్ (50: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), దీపక్ హుడా (41: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చాలా వేగంగా ఆడారు. రెండో వికెట్‌కు 39 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు.


వీళ్లు అవుటయ్యాక ఇన్నింగ్స్ నెమ్మదించింది. కృనాల్ పాండ్యా (25: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అయుష్ బదోని (15: 18 బంతుల్లో) వేగంగా ఆడలేకపోయారు. కానీ శివం మావి వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఒక్కసారిగా ఊపు తెచ్చింది. ఈ ఓవర్లో లక్నో బ్యాటర్లు ఐదు సిక్సర్లతో 30 పరుగులు సాధించారు. మొదటి మూడు బంతులను సిక్సర్లు కొట్టిన మార్కస్ స్టోయినిస్ (28: 14 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) నాలుగో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివరి రెండు బంతులను జేసన్ హోల్డర్ (13: 4 బంతుల్లో) భారీ సిక్సర్లు కొట్టాడు.


కానీ చివరి ఓవర్లో కోల్‌కతా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. టిమ్ సౌతీ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా... టిమ్ సౌతీ, శివం మావి, సునీల్ నరైన్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు.


ఆరంభంలోనే హ్యాండ్సప్
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఏడు ఓవర్లలో 25 పరుగులకే కోల్‌కతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ కాసేపు మెరుపు వేగంతో ఆడినా... ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. రసెల్, నరైన్, ఆరోన్ ఫించ్ తర్వాత అత్యధిక స్కోరు ఆరు పరుగులంటేనే అర్థం చేసుకోవచ్చు కోల్‌కతా ఎంతలా విఫలం అయిందో.


లక్నో బౌలర్లలో అవేష్ ఖాన్, జేసన్ హోల్డర్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. మొహ్‌సిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది. బౌలింగ్ చేసిన ప్రతి లక్నో బౌలర్ వికెట్ తీశారు. మొహ్‌సిన్ ఖాన్, అవేష్ ఖాన్‌లు మెయిడిన్ ఓవర్లు కూడా బౌల్ చేశారు.