ఇగో చూపించడం వల్లే కీరన్‌ పొలార్డ్‌ పరుగులు చేయలేకపోయాడని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అంటున్నాడు. అందువల్లే ముంబయి ఇండియన్స్‌ భారీ స్కోరు చేయలేకపోయిందని పేర్కొన్నాడు. అతడు ఇగోని కంట్రోల్‌ చేసుకొని ఉంటే గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉండేవని వెల్లడించాడు.


చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచులో పొలార్డ్‌ కేవలం 14 పరుగులే చేశాడు. ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ మాత్రమే కొట్టాడు. శ్రీలంక స్పిన్నర్‌ మహేశ్‌ థీక్షణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఓ భారీ షాట్‌ ఆడబోయి లాంగాన్‌లో క్యాచ్‌ ఇచ్చాడు.


'స్ట్రెయిట్‌గా కొట్టడమే పొలార్డ్‌ బలం. అందుకే సీఎస్‌కే అక్కడ ఫీల్డర్‌ను మోహరించింది. అలాంటప్పుడు అతడు ఎక్రాస్‌గా ఆడాలి. కానీ అందుకు అతడు అంగీకరించలేదు. కావాలనే స్ట్రెయిట్‌గా ఆడాలని అనుకున్నాడు. ఇంకా చెప్పాలంటే అతడు తన ఇగోను పక్కన పెట్టలేదు. ఎక్కువ మ్యాచులు ఆడేకొద్దీ, ఎక్కువ అనుభవం వచ్చేకొద్దీ, ఎక్కువ మ్యాచులకు గెలిపించే కొద్దీ  ఎక్కువ ట్రాప్‌లు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు తన బలమేంటో చూపించాలనుకుంటారు. తన బలం చూపించేందుకు పొలార్డ్‌ స్ట్రెయిట్‌గా కొట్టాడు. వికెట్‌ ఇచ్చేశాడు. అంటే లాంగాన్‌, లాంగాఫ్‌లో ఫీల్డర్లను పెట్టినా కొట్టగలనని భావించి ఔటయ్యాడు' అని ఇర్ఫాన్‌ పఠాన్‌ వివరించాడు. ఈ సీజన్లో పొలార్డ్‌ ఆశించిన మేరకు రాణించలేదు. కేవలం 16 సగటుతో 96 పరుగులే చేశాడు, అత్యధిక స్కోరు 25.


CSK మ్యాచ్‌లో MI బ్యాటింగ్‌ ఎలా సాగిందంటే?


ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో అద్భుతమైన మ్యాచ్. పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని ఆఖరి బంతికి బౌండరీ కొట్టి చెన్నైని గెలిపించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా... చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా... చాలా కాలం తర్వాత ధోని తనలోని ఫినిషర్‌ను బయటకు తీయడంతో ఈ ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.


మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్లు ఇషాన్ కిషన్ (0: 1 బంతి), రోహిత్ శర్మలను (0: 2 బంతుల్లో) డకౌట్ చేసి ముకేష్ చౌదరి ముంబైని కష్టాల్లోని నెట్టేశాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్‌ను (4: 7 బంతుల్లో) కూడా అవుట్ చేయడంతో ముంబై 23 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (32: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.


అయితే ఈ దశలో కొత్త కుర్రాళ్లు తిలక్ వర్మ (51 నాటౌట్: 43 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), హృతిక్ షౌకీన్ (25: 25 బంతుల్లో, మూడు ఫోర్లు) ముంబైని ఆదుకున్నారు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ (19: 9 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) వేగంగా ఆడటంతో ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది.