IPL 2022 Ponting in isolation after family member tests positive for Covid-19 : ఐపీఎల్ 2022లో దిల్లీ క్యాపిటల్స్‌కు కరోనా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఫ్రాంచైజీకి అత్యంత కీలకమైన కోచ్ రికీ పాంటింగ్ ఐదు రోజులు ఐసోలేట్ అవుతున్నాడు. అతడి కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడమే ఇందుకు కారణం.
దిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం రాజస్థాన్‌తో తలపడనుంది. వాంఖడే ఇందుకు వేదిక. ఈ మ్యాచుకు ముందు నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో పాంటింగ్ కుటుంబీకులకు పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. ఆయనకు చేసిన రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా ఐదు రోజుల పాటు హోటల్లోనే ఐసోలేట్ అవుతున్నారు. ఆటగాళ్లు, ఫ్రాంచైజీకి ఇబ్బందులు ఉండొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆటగాళ్లందరికీ నెగెటివ్ రావడంతో మ్యాచ్ యథావిధిగా కొనసాగనుంది.
'జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఐదు రోజుల పాటు పాంటింగ్‌ను ఐసోలేషన్‌లో ఉంచాలని మేనేజ్‌మెంట్, మెడికల్ టీమ్ నిర్ణయం తీసుకుంది' అని దిల్లీ ఫ్రాంచైజీ వెల్లడించింది. రాజస్థాన్ మ్యాచ్ తర్వాత దిల్లీకి కొన్ని రోజుల విరామం దొరకనుంది. ఏప్రిల్ 28న కేకేఆర్‌తో తర్వాతి మ్యాచ్ ఆడనుంది. ఈ లోగా ఐదు రోజులు పూర్తవుతాయి కాబట్టి పాంటింగ్ అందుబాటులోకి వస్తారు. ప్రవీణ్ ఆమ్రె, జేమ్స్ హోప్స్, అజిత్ అగార్కర్, షేన్‌వాట్సన్‌తో కూడిన సహాయ బృందంతో కలుస్తారు.
ఇప్పటి వరకు దిల్లీ బృందంలో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. మొదట ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియా, అడ్మినిస్ట్రేషన్‌లో కొందరికి వచ్చింది. మూడు రోజులకు ఆసీస్ క్రికెటర్ మిచెల్ మార్ష్‌కు కొవిడ్ రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అతడికి సీరియస్‌గా లేనప్పటికీ ముందు జాగ్రత్తగా ఇలా చేశారు. బుధవారం చేసిన పరీక్షల్లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌కు పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో పుణెలో జరగాల్సిన మ్యాచులను ముంబయికి తరలించారు. బహుశా అక్కడ మ్యాచులు నిర్వహించకపోవచ్చని తెలుస్తోంది.